నిర్భయ దోషులను రేపు 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు తీహార్ జైల్లో ఉరి తీయమని పాటియాలా హౌజ్ కోర్టు ఇప్పటికే వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. రేపే ఉరి శిక్ష ఉండడంతో నేడు ఆ దోషులు మరో మారు ఆఖరు ప్రయత్నంగా కోర్టు మెట్లెక్కారు. 

ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన సంఘటనలను ఒకసారి చూద్దాం. నిర్భయ ఉదంతం జరిగినప్పుడు తాను ఢిల్లీలోనే లేనని నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేష్ సింగ్ సుప్రీమ్ తలుపు తట్టాడు. తనకు ఆ ఉదంతానికి సంబంధం లేదని చెబుతున్నప్పటికీ కింది కోర్టులు తన మాటను వినిపించుకోలేదని సుప్రీమ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు. 

అత్యవసర పిటిషన్ గా పరిగణించిన సుప్రీమ్ కోర్టు, ఈ పిటిషన్ పై మధ్యాహ్నం 2.30కు వాదనలు వినడం ఆరంభించింది. వాదనలను విన్న సర్వోన్నత న్యాయస్థానం ఆ పిటిషన్ ను కొట్టివేసింది. 

ఇక మరో దోషి పవన్ గుప్తా ఫైల్ చేసిన రెండవ క్యూరేటివ్ పిటిషన్ ను కూడా నేటి ఉదయం కోర్టు తోసిపుచ్చింది. నేరం జరిగినప్పుడు తాను  మైనర్ నని, కింద కోర్టులు తన వాదనను వినలేదని తెలుపుతూ రెండవసారి క్యూరేటివ్ పిటిషన్ ఫైల్ చేసాడు. కానీ కోర్టు మరోసారి కొట్టేసింది. 

ఇక ఈ కేసులో మరో నిందితుడు అక్షయ్ సింగ్ భార్య తనకు విడాకులు కావాలని బీహార్ కోర్టు మెట్లెక్కింది. ఒక రేపిస్టు భార్యగా తాను వైధవ్యాన్ని పొందదలుచుకోట్లేదని ఆమె కోర్టుకెక్కారు. కోర్టు ఆ పిటిషన్ ను విచారానికి స్వీకరించలేదు. 

ఇదే అక్షయ్ సింగ్ సుప్రీమ్ లో తన క్షమాభిక్షను రాష్ట్రపతి తీయూరస్కరించడాన్ని ఛాలెంజ్ చేస్తూ మరో పిటిషన్ దాఖలు చేసాడు. ఆ కేసును వాదిస్తున్న నిందితుడి లాయర్ ఏపీ సింగ్ తన వాదనలు వినిపిస్తూ... చట్టప్రకారం రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ ని కొట్టివేసిన విధానం కరెక్ట్ కాదని తెలిపాడు. 

అంతే కాకుండా తీవ్రమైన ప్రజల ఒత్తిడి కారణంగా కేసు విచారణ పక్షపాతంగా సాగించని కూడా ఆయన వాదించారు. ఆ పెతితిఒన్ పై సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు ఆ పిటిషన్ ను కూడా కొట్టివేసింది. 

నిందితుల తరుఫు లాయర్ ఈ కేసులతో ఆగకుండా.... మరో పిటిషన్ కూడా వేసాడు. నిందితులవి అనేక కేసులు విచారణలో ఉన్నందున రేపటి మరణ శిక్షపైన స్టే విధించాలని ఢిల్లీ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసాడు. కోర్టు ఆ పిటిషన్ ని కూడా కొట్టేసింది. 

ఇక అన్ని కేసులు కొట్టివేయడంతో రేపు ఉదయం 5.30 కు ఉరి తథ్యం.