న్యూఢిల్లీ: నిర్భయ కేసులో వాదనలు వింటున్న ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ లో ఒకరిగా ఉన్న జస్టిస్ ఆర్ భానుమతి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నిర్భయ దోషులకు విడివిడిగా ఉరి శిక్ష వేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్రం ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

ఆ పిటిషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణను చేపట్టింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. దానికి సంబంధించి ఉత్తర్వులను చవిది వినిపిస్తున్న క్రమంలో జస్టిస్ భానుమతి అస్వస్థత వల్ల సొమ్మసిల్లారు. ప్రాథమిక చికిత్స తర్వాత కోలుకున్నారు. 

Also Read: నిర్భయ కేసు: వినయ్ శర్మ పిటిషన్‌ తిరస్కరించిన సుప్రీం

ఆమెను వీల్ చైర్ లో ఛాంబర్ కు తరలించారు. ఆ తర్వాత ఆమెకు వైద్యులు చికిత్స అందించారు. విచారణ తేదీని ఉత్తర్వుల్లో వెల్లడిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. దోషుల ఉరికి సంబంధించి వచ్చే సోమవారం కింది కోర్టు ఉత్తర్వులు వెలువరించనున్న నేపత్యంలో అప్పటి వరకు వేచి చూడాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. 

ఇప్పటి వరకు దోషులకు సంబంధించి ఎటువంటి పిటిషన్లు కూడా పెండింగ్ లో లేవని తెలిపింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ క్షమాభిక్ష తిరస్కరణను సవాల్ చేస్తూ దోషుల్లో ఒక్కడైన వినయ్ శర్మ దాఖలు చేసుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.

Also Read: వాటిని రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకోలేదు: నిర్భయ కేసు దోషి వినయ్ శర్మ