న్యూఢిల్లీ: సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టును, మెడికల్ స్టేటస్ రిపోర్టును పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన మెర్సీ పిటిషన్ ను తిరస్కరించారని నిర్భయ కేసు దోషుల్లో ఒక్కడైన వినయ్ శర్మ కోర్టుకు చెప్పుకున్నాడు. వినయ్ శర్మ తరఫున న్యాయవాది ఏపీ సింగ్ సుప్రీంకోర్టులో వాదిస్తూ గురువారం ఆ వ్యాఖ్యలు చేశాడు. 

సామాజిక దర్యాప్తు నివేదికను, వైద్య పరీక్షల నివేదికను, పిటిషనర్ నామినల్ రోల్ ను పరిగణనలోకి తీసుకోకుండానే వినయ్ శర్మ మెర్సీ పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించారని ఆయన అన్నారు. వినయ్ శర్మను అక్రమంగా నిర్భంధించారని, తీహార్ జైలులో అక్రమంగా చిత్రహింసలు పెట్టారని ఆయన ఆరోపించారు. 

Also Read: లాయర్ ను తొలిగించా: పవన్, కన్నీరు మున్నీరైన నిర్భయ తల్లి, నిరసన

అందుకే తాను ఇక్కడ న్యాయం కోరుతున్నానని, తాను ఇంకా ఎక్కడికి వెళ్లలేనని ఆయన అన్నారు. న్యాయం కోసం తాను ఇక్కడ కోర్టును వేడుకుంటున్నట్లు తెలిపారు. వారు ఉగ్రవాదులు కారని, నేరచరిత్ర కలిగినవారు కాదని, అవే దోషులకు క్షమాభిక్ష పెట్టడానికి తగినవని ఆయన అన్నారు. 

వినయ్ ను శారీరకంగా హింసించిన చరిత్ర ఉందని, చాలా సార్లు వినయ్ ను సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకుని వెళ్లారని, పిటిషనర్ మెంటల్ కండీషన్ బాగా లేదని, అంతులేని వేదనను అనుభవించాడని ఆయన అన్నారు. మానసిక పరిస్థితిని మెరుగు పరచడానికి వినయ్ కు తగిన చికిత్స అందించాల్సి ఉందని అన్నారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని రేపు శుక్రవారం 2 గంటలకు వెలువరించనుంది.

తన మెర్సీ పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ వినయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తనకు విధించిన మరణశిక్షను జీవీత ఖైదుగా మార్చాలని ఆయన కోరాడు. ఫిబ్రవరి 1వ తేదీన రాష్ట్రపతి అతని మెర్సీ పిటిషన్ ను తోసిపుచ్చారు. 

నిర్భయ కేసులోని నలుగురు దోషులు ముకేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్ లకు ఫిబ్రవరి 1వ తేదీన మరణశిక్ష అమలు చేయాల్సి ఉండగా, కోర్టు దానిపై స్టే ఇచ్చింది.