నిర్భయ దోషులను నేటి ఉదయం 5.30కు ఉరి తీసిన విషయం తెలిసిందే! 2012లో ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ లో అత్యంత పాశవికంగా ఆ యువతిని చిత్రహింసలకు గురి చేసిన కేసులో ఎట్టకేలకు వారికి ఉరి పడింది. నిర్భయ ఆత్మకు ఇప్పుడు శాంతి కలిగిందంటూ యావత్ దేశం సంబరాల్లో మునిగిపోయింది. 

ఇక ఇది ఇలా ఉంటే... ఉరికి ముందు కూడా ఆఖరు ప్రయత్నంగా దోషుల తరుఫు లాయర్ మరోసారి నిన్నటి అర్థరాత్రి దాటినా తరువాత నేటి ఉదయం సుప్రీమ్ తలుపు తట్టాడు. దీనిపైనా ధర్మాసనం నేటి ఉదయం 2.30కు అత్యవసరంగా విచారణ చేపట్టింది. 

Also read: ఉరికి ముందు కూడా డ్రామాలు ఆపని నిర్భయ దోషులు, ఏమి చేశారంటే...

లాయర్ చెప్పిన ఏ విషయానికి కూడా అంగీకరించని కోర్టు అన్ని పిటిషన్లను తోసిపుచ్చి వారికి ఉరిని ఖరారు చేసిన విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలో అసలు నిన్న రాత్రి నుండి జరిగిన సంఘటనలు ఒకసారి చూద్దాం. 

నలుగురు దోషులు పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్ లు నిన్న రాత్రి నుండి కూడా వింతగా పిచ్చెక్కినట్టు ప్రవర్తించారు. వినయ్ శర్మ అర్థం పర్థం లేని మాటలు మాడ్లాడగా, పవన్ గుప్తా జైలు అధికారులను దూషించాడు కూడా!

ఈ నలుగురిలో ముకేశ్ సింగ్, వినయ్ శర్మలు మాత్రమే రాత్రి భోజనం చేసారు. మరో ఇద్దరు పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్ లు భోజనాన్ని నిరాకరించారు. ముకేశ్ సింగ్ కుటుంబ సభ్యులు మాత్రం అతడిని కలవడానికి నైట్ జైలుకు వచ్చారు. 

ఇక నేటి ఉదయం 4 గంటల కల్లా తలారి పవన్ జల్లాద్ అంతా రెడీ అయి జైలు అధికారులతో సమావేశమయ్యారు. ఆ తరువాత నిర్భయ దోషులను స్నానం చేయమని కోరారు. ఆ తరువాత వారిని అల్పాహారం సేవించమని కోరినప్పటికీ వారు అందుకు నిరాకరించారు. 

నిన్న రాత్రంతా నిర్భయ దోషులను వేర్వేరు రూముల్లో ఉంచారు. రాత్రంతా వారు నిద్రపోలేదు. జైలులోని మిగితా ఖైదీలు కూడా ఉదయం సాధారణంగా జైలు అధికారులు నిద్రలేపేకన్నా ముందే లేచి ఆసక్తిగా ఎదురు చూసారు. 

జైలు లోపల పరిస్థితులు ఇలా ఉండగా... జైలు బయట భారీ సంఖ్యలో ప్రజలు గుమికూడారు. నిర్భయ తల్లి ఆశాదేవితో సహా అనేకమంది బయట నిర్భయ ఆత్మకు శాంతి చేకూరింది అని నినదించారు. తీహార్ జైలు అధికారులు జైలు బయట లోపల భద్రతను పెంచారు.