కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటే రైతులు గత కొన్నిరోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిని శాంతింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు విడతలుగా చర్చలు జరుపుతోంది.

కానీ ఇరు వర్గాలకు ఏకాభిఫ్రాయం కుదరకపోవడంతో చర్చలు విఫలమవుతున్నాయి. తాజాగా ఇవాళ జరిగిన చర్చలు సైతం అర్థాంతరంగా ముగిశాయి. ఈ నెల 18న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో 40 రైతు సంఘాలతో సమావేశమైన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. ఆందోళనలు విరమించాలని కోరారు. ఎంఎస్‌పీపై తొమ్మిదో విడత చర్చలు జరుగుతున్నాయి.

రైతు సంఘాలు మాత్రం చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ పట్టుబడుతున్నాయి. కేంద్రం మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. ఇప్పటికే నలుగురు సభ్యులతో కమిటీ వేసింది సుప్రీంకోర్ట్.

పది రోజుల్లోగా తొలి సమావేశం కావాలని ఆదేశిస్తూ.. రైతు సంఘాలతో చర్చించాలని సూచించింది. రైతులు మాత్రం కమిటీతో చర్చలు జరపబోమంటూ తేల్చి చెబుతున్నారు.