నిషేధిత పీఎఫ్‌ఐ లింకులు.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు..
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు చేపట్టింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లలో నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)కి చెందిన పలు ప్రాంగణాలపై ఎన్‌ఐఏ బృందాల దాడులు కొనసాగుతున్నాయి.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు చేపట్టింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లలో నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)కి చెందిన పలు ప్రాంగణాలపై ఎన్‌ఐఏ బృందాల దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున 5 గంటల నుంచే ఈ సోదాలు ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, బారాబంకి, బహ్రైచ్, సీతాపూర్, హర్దోయ్‌లలో ఎన్‌ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. లక్నోలోని ఒకే ప్రాంతంలోని మూడు ఇళ్లపై ఎన్‌ఐఏ బృందాలు, పారామిలటరీ బలగాలు సోదాలు చేపట్టాయి.
ముంబైలోని విక్రోలి ప్రాంతంలో నివసిస్తున్న అబ్దుల్ వాహిద్ షేక్ ఇంటికి ఎన్ఐఏ బృందం చేరుకుంది. 2006 ముంబై రైలు బాంబు పేలుళ్ల నిందితుల్లో వాహిద్ షేక్ ఒకరు. అయితే ట్రయల్ కోర్టు అతనిని అన్ని అభియోగాల నుండి నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఈరోజు ఉదయం 5 గంటలకు ఎన్‌ఐఏ బృందం అతడి ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఎన్‌ఐఏ బృందాలను లోనికి అనుమతించేందుకు అతను నిరాకరించాడు. ముందుగా లీగల్ నోటీసు పంపాలని కోరారు.
ఇక, రాజస్థాన్‌లోని టోంక్, కోట, గంగాపూర్‌లలో ఎన్‌ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. పలువురు అనుమానితులను ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బుధవారం తెల్లవారుజాము నుండి మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. పీఎఫ్‌ఐపై నమోదైన కేసులకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయి.
ఇదిలాఉంటే, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేరళలోని త్రిసూర్, ఎర్నాకులం, మలప్పురం, వాయనాడ్ జిల్లాలోని మాజీ పీఎఫ్‌ఐ కార్యకర్తల ఇళ్లలో సెప్టెంబర్‌లో దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఆగస్టులో మలప్పురంలోని పలువురు పీఎఫ్‌ఐ కార్యకర్తల ఇళ్లపై ఎన్‌ఐఏ దాడులు చేసింది. నిషేధిత పీఎఫ్‌ఐలో భాగమైన వెంగరలోని తయ్యిల్ హంజా, తిరూర్‌లోని కళతిపరంబిల్ యాహుతి, తానూర్‌లోని హనీఫా, రంగత్తూరు పడిక్కపరంబిల్ జాఫర్‌ల ఇళ్లపై కూడా దాడులు నిర్వహించారు.