ముంబైపై ఉగ్రవాదులు మరోసారి కన్నేశారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఉగ్రవాది సర్పరాజ్ ముంబైలోకి ప్రవేశించినట్టుగా ఎన్ఐఏ మెయిల్ అందుకుంది.
ముంబై:అత్యంత కరుడు గట్టిన ఉగ్రవాది సర్ఫరాజ్ మెమన్ ముంబైలో ప్రవేశించినట్టుగా ఎన్ఐఏ కు మెయిల్ అందింది. ఈ మెయిల్ ను ముంబై పోలీసులకు కూడా ఎన్ఐఏ పంపింది. రెండు రోజుల క్రితం ఎన్ఐఏకు మెయిల్ అందింది.
ఇండోర్ కు చెందిన ఉగ్రవాది సర్పరాజ్ మెమన్ అత్యంత కరుడుగట్టిన ఉగ్రవాదిగా ఎన్ఐఏ పేర్కొంది. చైనా, పాకిస్తాన్ లలో మెమన్ శిక్షణ పొందినట్టుగా ఎన్ఐఏ తెలిపింది. ఉగ్రవాది ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్టు కూడా ఎన్ఐఏ ముంబై పోలీసులకు పంపింది.
ముంబై, ఇండోర్ పోలీసులకు కూడా ఈ మెయిల్ అందింది. ఈ మెుయిల్ గురించి కూడా దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నాయి. పక్కదారి పట్టించేందుకు మెయిల్ పంపారా లేదా దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇచ్చారా అనే కోణంలో కూడా అధికారులు విచారిస్తున్నారు.
ఈ మెయిల్ విషయమై ఎన్ఐఏ సహ ఇతర దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. దర్యాప్తు సంస్థలకు ముంబై పోలీసులు సహకరిస్తున్నారు. ఇండోర్ లో గల మెమన్ నివాసం పరిసర ప్రాంతాల్లో కూడా దర్యాప్తు బృందాలు ఈ విషయమై ఆరా తీశాయి.
మరో వైపు ఈ నెల ప్రారంభంలో తాలిబన్ తో సంబంధాలున్న ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఎన్ఐఏ కు మెయిల్ అందిన విషయం తెలిసిందే. భారతదేశానికి వాణిజ్య రాజధానిగా ఉన్న ముంబైని దెబ్బతీయాలని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో సముద్ర మార్గం ద్వారా ముంబైలోకి ప్రవేశించి ఉగ్రవాదులు మారణహోమాన్ని సృష్టించారు.ఈ ఘటనలో ఉగ్రవాది కసబ్ ను పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. కసబ్ నుండి కీలక ఆధారాలను అప్పట్లో దర్యాప్తు సంస్థలు సేకరించిన విషయం తెలిసిందే.
