ఖలిస్తాన్ ఉగ్రవాదులు , మద్ధతుదారులపై ఎన్ఐఏ గురి.. భింద్రన్ వాలే మేనల్లుడు లఖ్బీర్ సింగ్ ఆస్తుల జప్తు
భారత్‌లో, భారత్‌కు వెలుపలా వున్న ఖలిస్తాన్ మద్ధతుదారులపై దర్యాప్తు సంస్థలు గురిపెట్టాయి. ఖలిస్తాన్ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడ్ ఆస్తులను ఎన్ఐఏ బుధవారం జప్తు చేసింది . నిషేధిత ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్ (ఐఎస్‌వైఎఫ్)కు లఖ్బీర్ సింగ్ నేతృత్వం వహిస్తున్నాడు.

ఖలిస్తాన్ వేర్పాటువాద నేత, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం వుందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో, భారత్‌కు వెలుపలా వున్న ఖలిస్తాన్ మద్ధతుదారులపై దర్యాప్తు సంస్థలు గురిపెట్టాయి. దీనిలో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం .. ఖలిస్తాన్ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడ్ ఆస్తులను జప్తు చేసింది. అలాగే పంజాబ్‌లోని మోగాలో సోదాలు నిర్వహించింది.
నిషేధిత ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్ (ఐఎస్‌వైఎఫ్)కు లఖ్బీర్ సింగ్ నేతృత్వం వహిస్తున్నాడు. ఇతనిని భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. లఖ్భీర్ సింగ్ .. కరడుగట్టిన ఖలిస్తాన్ వాది జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేకు స్వయానా మేనల్లుడు. ఎన్ఐఏ అధికారుల బృందం.. పంజాబ్ పోలీసులతో కలిసి లఖ్బీర్ పూర్వీకుల గ్రామానికి చేరుకుని దాదాపు 1.4 ఎకరాల భూమి, ఇతర ఆస్తులను జప్తు చేశారు. ఉపా చట్టం కింద లఖ్బీర్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్ఐఏ ప్రత్యేక కోర్డు ఆదేశాల మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ అతని ఆస్తులను జప్తు చేసింది.
2021లో ఫజిల్కా జిల్లాలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో జరిగిన టిఫిన్ బాంబు పేలుడుకు సంబంధించి పేలుడు పదార్ధాల చట్టం కింద లఖ్బీర్‌పై పలు కేసులు నమోదయ్యాయి. ఆర్‌డీఎక్స్‌తో పాటు ఆయుధాలు, పేలుడు పదార్ధాల స్మగ్లింగ్ , న్యూఢిల్లీలో నేతలపై దాడికి కుట్ర పన్నడం , పంజాబ్‌లో ద్వేషాన్ని వ్యాప్తి చేయడం వంటి కేసుల్లో అతను మోస్ట్ వాంటెడ్‌గా వున్నాడు. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, కస్టమ్‌మేడ్ టిఫిన్ బాంబులు, గ్రెనేడ్‌లు, డ్రగ్స్‌తో సహా తీవ్రవాద హార్డ్‌వేర్‌లను పంపించడానికి లఖ్బీర్ పాకిస్తాన్‌కు చెందిన కొందరితో పనిచేశాడని ఎన్ఐఏ ఆరోపించింది. 2021 నుంచి 2023 మధ్య ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నందుకు లఖ్బీర్‌పై యాంటీ టెర్రర్ ఏజెన్సీ ఆరు కేసులను దర్యాప్తు చేస్తోంది.