న్యూఢిల్లీ: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లోని సిటీ కొత్వాలీ పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో  మగ పోలీసుల ముందే  తల్లిని ,ఆమె కూతురును బట్టలిప్పి చావ బాదిన ఘటనపై సత్వరమే విచారణ చేయాలని  ఛత్తీస్‌ఘడ్ డీజీపీకి  జాతీయ మానవహక్కుల కమిషన్  నోటీసులు జారీ చేసింది.

ఈ ఏడాది అక్టోబర్ 14వ తేదీన చోరీకి పాల్పడ్డారనే  ఆరోపణలతో  60 ఏళ్ల మహిళ, 27 ఏళ్ల  ఆమె కూతురును  పోలీసులు అరెస్ట్ చేశారు. మగ పోలీసుల ముందే వారిని వివస్త్రలను చేసి చితకబాదారు. ఈ ఘటనపై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ కథనాల ఆధారంగా  జాతీయ మానవహక్కుల కమిషన్  స్పందించింది.ఈ ఘటనను సుమోటోగా తీసుకొంది.

తనకు బీపీ ఉందని... కనీసం  వైద్యం అందించాలని  తల్లి కోరినా కూడ పోలీసులు పట్టించుకోలేదని మీడియాలో కథనాలు వచ్చాయి. బాధితుల మర్మావయవాల్లో కూడ తీవ్రమైన గాయాలున్నాయని జాతీయ మానవ హక్కుల కమిషన్ అభిప్రాయపడింది.  ఈ ఘటనపై నాలుగు వారాల్లో విచారణ జరిపించాలని ఆదేశించింది. అంతేకాదు బాధ్యులైన పోలీసులపై ఏ రకమైన చర్యలు తీసుకొన్నారో చెప్పాలని డిమాండ్ చేసింది.