న్యూఢిల్లీ: గంగానదిలో మృతదేహాలపై  జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు గురువారం నాడు నోటీసులు జారీ చేసింది. బీహార్,  ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో గంగా నదలో పలు మృతదేహాలు కలకలం సృష్టించాయి. కరోనాతో మరణించిన వారి మృతదేహాలను నదిలో వేశారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

also read:గంగా నదిలో మృతదేహాల కలకలం: కరోనాతో చనిపోయినవారేనా?

 ఈ విషయమై అందిన ఫిర్యాదుల మేరకు  ఎన్‌హెచ్ఆర్సీ  కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖతో పాటు ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.బీహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో పాటు  జల్‌శక్తి మంత్రిత్వశాఖ సెక్రటరీలకు నోటీసులు పంపింది. నాలుగు వారాల్లోపుగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఉజియార్, కుల్హాడియా, భరౌలి ఘాట్ల వద్ద కనీసం 52 మృతదేహాలు గంగా నదిలో తేలినట్టుగా బల్దియా వాసులు ఫిర్యాదు చేశారు. సగం కాలిపోయిన లేదా ఇతర మృతదేహాలను గంగాలో వేయకుండా ఆపడంలో అధికారులు విఫలమయ్యారని  ఎన్‌హెచ్ఆర్‌సీ తెలిపింది. పవిత్రమైన గంగానదిలో మృతదేహాలను వేయడం ద్వారా నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ప్రాజెక్టు మార్గదర్శకాలను  ఉల్లంఘించినట్టేనని ఎన్‌హెచ్‌ఆర్‌సీ అభిప్రాయపడింది.గంగా నదిలోని మృతదేహాలు కరోనాతో మరణించినవారివేనని పలు మీడియా సంస్థలు రిపోర్టు చేసిన విషయాన్ని ఎన్‌హెచ్ఆర్‌సీ ఆ ప్రకటనలో గుర్తు చేసింది.