మరి కొన్ని గంటల్లో తమ రిసెప్షన్ ఫంక్షన్ జరుగుతుందనగా.. నూతన వధూ వరులు గదిలో రక్తపు మడుగులో విగతజీవులై కనిపించారు. ఛత్తీస్‌గడ్‌లో ఈ ఘటన జరిగింది. ఆ దంపతుల మధ్య జరిగిన గొడవతో భార్యను భర్త కత్తితో పొడిచి చంపి ఉంటాడని, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 

రాయ్‌పూర్: ఛత్తీస్‌గడ్‌లో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. 24 ఏళ్ల యువకుడు, 22 ఏళ్ల యువతి పెళ్లి చేసుకున్నారు. ఆదివారం పెళ్లి చేసుకున్న ఆ జంట రిసెప్షన్ మంగళవారం నాడు జరగాల్సి ఉంది. ఇంతలోనే వారిద్దరూ ఒకే గదిలో రక్తపు మడుగులో విగత జీవులై కనిపించారు. ఇద్దరికీ కత్తి పోట్ల గాయాలు ఉన్నాయి. ఈ ఘటన ఛత్తీస్‌గడ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిందని బుధవారం పోలీసులు వెల్లడించారు.

నూతన వధువు, వరుడి మధ్యనే గొడవ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ గొడవ ముదిరి వరుడు కత్తితో వధువును పొడిచి చంపేసి ఉంటాడని, ఆ తర్వాత తననూ కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. తిక్రాపార పోలీసు స్టేషన్ పరిధిలోని బ్రిజ్‌నగర్‌‌లో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.

24 ఏళ్ల అస్లాం, 22 ఏళ్ల కాకాషా బానోలు ఆదివారం పెళ్లి చేసుకున్నారు. వారి రిసెప్షన్ మంగళవారం రాత్రి జరగాల్సింది. ఆ ఫంక్షన్ కోసం అందరూ సిద్ధం అవుతున్నారు. అదే సమయంలో సడన్‌గా వారి గదిలో నుంచి పెళ్లి కూతురు అరుపు వినిపించింది. దీంతో పెళ్లి కొడుకు తల్లి అటు వైపుగా పరుగెత్తింది. 

‘ఆ గది లోపలి వైపు నుంచి తాళం వేసి ఉన్నది. వారిని ఎంత పిలిచినా స్పందించలేదు. ఆ కుటుంబ సభ్యులు కొందరు ఆ గది కిటికీ డోర్ ఓపెన్ చేసి లోనికి చూశారు. అక్కడ రక్తపు మడుగులో వారిద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని చూశారు. ఆ తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం అందించారు’ అని ఓ అధికారి వివరించారు.

Also Read: రూ. 1800 క్యాష్ గురించి దంపతుల మధ్య గొడవ.. ఆత్మహత్య చేసుకున్న భర్త.. హైదరాబాద్‌లో ఘటన

పోలీసులు స్పాట్‌కు చేరుకుని డోర్ పగులగొట్టి లోనికి వెళ్లారు. కత్తి పోట్ల గాయాలతో ఉన్న ఆ ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్‌కు తరలించారు. స్పాట్ నుంచి ఓ కత్తిని రికవరీ చేసుకున్నట్టు ఓ అధికారి చెప్పారు.

ఆ జంట మధ్యనే గొడవ జరిగి ఉంటుందని, కత్తితో తన భార్యపై దాడి చేసి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ప్రాథమికంగా తమకు తెలుస్తున్నదని పోలీసులు వివరించారు. దర్యాప్తు మొదలు పెట్టామని, పూర్తి వివరాలు దర్యాప్తు పూర్తయ్యాక తెలుస్తాయని చెప్పారు.