వరకట్న వేధింపులు తట్టుకోలేక ఓ నవ వధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. సెల్ఫీ వీడియో తీసుకొని మరీ ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడగా.. స్థానికులు ఆమెను రక్షించారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే... ధర్మపురి జిల్లా కదిర్‌ నాయకన్‌హల్లికి చెందిన మణిమొళికి సెంగాని అనే వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం జరిగిన రెండో రోజు నుంచే ఆమెకు వరకట్న వేధింపులు మొదలయ్యాయి. దీంతో అదనంగా నాలుగు లక్షల నగదు, బంగారు నగలు తెచ్చింది. 

కానీ మరింత కట్నం తేవాలంటూ అత్తింటివారు ఆమెను వేధించారు. గత కొన్ని రోజులుగా ఆమె పుట్టింటి వద్దే ఉంటుంది. అక్కడితో ఆగని భర్త సెంగాని.. మణిమొళి ఇంటికి వచ్చి ఆమె తల్లిపై దాడి చేయడంతోపాటు చంపుతానని బెదిరించాడు.  ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో మణిమొళి సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారక స్థితిలో ఉన్న మణిమొళిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.  

ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంది. ప్రస్తుతం ఈ సెల్ఫీ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమెకు న్యాయం చేయాలని తమిళనాడు పోలీసులను నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు.