కరోనా రక్కసి కోరలకు ఓ నవవధువు బలయ్యింది. కాళ్ల పారాణి కూడా ఆరకముందే అనంతలోకాలకు తరలిపోయింది. చికిత్సకు బెడ్లు ఖాళీలేవంటూ.. తొమ్మిది ఆస్పత్రులు ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించడంతో చివరికి ఆమె అంబులెన్స్ లోనే చివరిశ్వాస విడిచింది. 

ఈ విషాద ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో చోటుచేసుకుంది. కరోనా బారిన పడిన నవ వధువుకు చికిత్సకు బెడ్స్ లేవంటూ 9 ఆసుపత్రులు నిరాకరించడంతో చివరకు ఆమె అంబులెన్స్ లోనే కన్నుమూశారు. 

స్వర్ణలత (25) అనే యువతికి భువనేశ్వర్ సమీపంలోని బల్లిపట్నా ప్రాంతంలో ఉంటున్న విష్ణుతో ఇటీవల వివాహమైంది. కొన్ని రోజుల కిందట స్వర్ణలతకు జ్వరం రావడంతో మాత్రలు వేసుకుంది. జ్వరం తగ్గకపోగా శనివారం ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో బల్లిపట్నా పి.హెచ్.సి కి తీసుకెళ్లారు.

అక్కడి వైద్యులు పరీక్షించి ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉందని కటక్ కు తీసుకువెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. కటక్ వైద్యులు భువనేశ్వర్ లోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచిస్తూ పంపించారు. 

తీరా అక్కడికి వెళ్ళాక కోవిడ్ రిపోర్టు లేకపోతే ఆసుపత్రిలో చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు. ఆ తరువాత ఎయిమ్స్ ఆస్పత్రి, ఆపై మరి కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఇలా తొమ్మిది చోట్ల ఆమెను ఎవరు చేర్చుకోలేదు. 

దీంతో కుటుంబీకులు మళ్లీ బల్లిపట్నా పీహెచ్సీకి తీసుకొచ్చారు. అక్కడి వైద్యులు కూడా ఈ పరిస్థితుల్లో వైద్యానికి ముందుకు రాకపోవడంతో మళ్ళీ ఆమెను భువనేశ్వర్ కు తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ఆరోగ్యం విషమించి స్వర్ణలత అంబులెన్స్ లోనే చనిపోయారు.