wedding gift: త‌మిళ‌నాడులో కొత్త‌గా పెళ్ల‌యిన ఓ జంట అసాధార‌ణ‌మైన వెడ్డింగ్ గిఫ్ట్ అందుకుంది. పెండ్లి జంట స్నేహితులు వారికి పెట్రోల్‌, డీజిల్ ను బ‌హుమ‌తిగా అందించారు. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్ గా మారింది.  

wedding gift: భారతదేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. దీంతో దేశంలోని వాహ‌న‌దారుల‌తో పాటు సామాన్య ప్ర‌జానీకంపైనా తీవ్ర‌మైన ఆర్థిక భారం ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలోనే త‌మిళ‌నాడు చోటుచేసుకున్న ఓ ఘ‌ట‌న వైర‌ల్ గా మారింది. కొత్త‌గా పెండ్ల‌యిన జంట‌కు అందించిన కానుక అదిరింది అంటూ దానిని చూసిన నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఎంటి ఆ బ‌హుమ‌తి? ఎందుకు ఇప్పుడు వైర‌ల్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పెండ్లి చేసుకున్న కొత్త జంట‌కు ఇచ్చ కానుక‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన ప‌నిలేదు. కానీ త‌మిళ‌నాడులో కొత్త‌గా పెండ్లి చేసుకున్న ఒక జంట‌కు అందిన బ‌హుమ‌తి స‌రికొత్త‌గా ఉంది. ఆ జంట‌కు వారి స్నేహితులు పెట్రోల్‌, డీజీల్ (petrol and diesel) ను కానుక‌లుగా అందించారు. ఈ బ‌హుమ‌తులు చూసిన కొత్త జంట‌తో పాటు అక్క‌డ‌కు వ‌చ్చిన బంధులు కానుక చూసి మొద‌ట ఆశ్చ‌ర్యంతో పాటు కొంత షాక్ గు గుర‌య్యారు. అయితే, ప్ర‌స్తుత ప‌రిస్థితి గురించి తెలిసి.. స‌రైన బ‌హుమ‌తి అంటూ కితాబు ఇచ్చారు. 

చెంగల్‌పట్టు జిల్లాలోని చెయ్యూర్‌లో గిరీష్ కుమార్ మరియు కీర్తనల వివాహం జ‌రిగింది. ఈ జంట‌కు జ‌రిగిన రిసెప్షన్‌లో, ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్న సమయంలో పెళ్లి కానుకగా వారి స్నేహితులు పెట్రోల్, డీజిల్ ను అందించారు. ఇటీవల ఇంధ‌న ధరలు పెరుగుతున్న త‌రుణంలో ఇలాంటి వస్తువుల వంటి అసాధారణ బహుమతులను బహుకరించడం అనేది ప్రజల దృష్టిని ఆకర్షించిన ట్రెండ్. 2021 ఫిబ్రవరిలో కూడా గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు పెరుగుతున్న త‌రుణంలో ఓ జంట‌కు గ్యాస్ సిలిండ‌ర్ బ‌హుక‌రించ‌డం కూడా అంద‌ర్నీ ఆక‌ర్షించింది. అలాగే, ఉల్లిపాయల దండ వంటి అసాధారణ బహుమతులు పెండ్లి జంట‌ల‌కు వచ్చాయి. అలాగే, ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లా పురుణబస్తీ గ్రామానికి చెందిన దేబాశిష్ పట్నాయక్, సిబానీ దంపతులకు కూడా స్నేహితులు తమ వివాహ కానుకగా పెట్రోల్‌ను అందించారు. 

ఇదిలావుండగా, దేశంలో చమురు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు వాహనదారుల నడ్డివిరుస్తున్నాయి. సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఇంధన ధరల పెరుగుదల వల్ల చాలా మందిపై ప్రభావం పడుతోంది. గత 17 రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 10 మేర పైకి చేరాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రేట్లను పెంచుకుంటూనే వస్తున్నాయి. అయితే ఏప్రిల్ 7న మాత్రం ఇంధ‌న ధ‌ర‌లు స్థిరంగానే ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి గురువారం (ఏప్రిల్ 07, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. దేశీయంగా గురువారం ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉంటుంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 105.41 కాగా, డీజిల్‌ రూ. 96.67 వద్ద కొనసాగుతోంది.