సంతోషంగా హనీమూన్ కి వెళ్లిన ఓ కొత్తజంట దుర్మరణం పాలయ్యింది. పడవ బోల్తా పడడంతో సముద్రంలో పడి మృతి చెందింది. 

తమిళనాడు : పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి.. సంతోషంగా హనీమూన్ కు వెళ్లిన ఓ కొత్త జంట ప్రమాదవశాత్తు మరణించిన ఘటన తమిళనాడులో విషాదాన్ని నింపింది. ఇండోనేషియాకి హనీమూన్ కోసం వెళ్లిన నవ దంపతులు ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయారు.. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లా పూనమల్లి సమీపం సనీర్ పుప్పానికి చెందిన వైద్యురాలు విభూషిణియా, చెన్నైకి చెందిన లోకేశ్వరన్ అనే డాక్టర్ జూన్ 1న వివాహం చేసుకున్నారు.

హనీమూన్ కోసం ఇండోనేషియాలోని బాలీ దీవికి వెళ్లారు. జూన్ 9వ తేదీన సముద్రంలో బోటు షికారుకు వెళ్లారు. అయితే, ప్రమాదవశాత్తు బోటు బోల్తా పడింది. దీంతో నవదంపతులిద్దరూ సముద్రంలో పడి చనిపోయారు. ప్రమాదాన్ని గ్రహించిన స్థానికులు వెంటనే గాలించగా లోకేశ్వరన్ మృతదేహం దొరికింది. శనివారం నాడు విభూషిణియా మృతదేహం దొరికింది. ఆ తరువాత ప్రమాదంపై దంపతుల కుటుంబాలకు సమాచారం అందించారు. ఇండోనేషియా నుంచి ఈ దంపతుల మృతదేహానులను చెన్నైకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 

ప్రాథమిక దర్యాప్తులో, వీరిద్దరూ సముద్రంలో స్పీడ్ బోట్ రైడ్ ప్లాన్ చేశారని, దానిని షూట్ చేయాలని నిర్ణయించుకున్నారని అధికారులు కనుగొన్నారు. అయితే, ప్రమాదవశాత్తు పడవ బోల్తాపడి, వారు సముద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన మీద విచారణ కొనసాగుతోంది. విషాదానికి దారితీసిన ఖచ్చితమైన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

హైఅలర్ట్.. తీవ్రమైన బిపర్‌జాయ్‌ తుఫాను.. 15 నాటికి ..

మృతదేహాలను తిరిగి చెన్నైకి తీసుకురావడానికి కుటుంబం ఏర్పాట్లు చేస్తోంది. దీని కోసం తమిళనాడు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు. ఇండోనేషియాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా తమ కుటుంబ సభ్యులు తమిళనాడు ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు సమాచారం.

ఇండోనేషియా నుండి చెన్నైకి నేరుగా విమానాలు అందుబాటులో లేనందున, మృతదేహాలను తమిళనాడుకు తిరిగి తీసుకురావడానికి ముందు మలేషియాకు పంపించాల్సి ఉంటుందని తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా, నిరుడు అక్టోబర్ లో ఇలాంటి విషాద ఘటనే వెలుగు చూసింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఈ సంఘటన జరిగింది. బాత్రూంలో గీజర్ పేలి నవ దంపతులు మరణించారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లోని ఖాదర్ బాగ్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో కూడా భార్యాభర్తలు ఇద్దరూ వైద్యులే. బాత్రూంలోని గీజర్ షార్ట్ సర్క్యూట్ వల్ల పేలినట్లు అనుమానిస్తున్నారు.