పాట్నా: బీహార్ విద్యాశాఖ మంత్రి మేవాలాల్ చౌదరి గురువారం నాడు మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 16వ తేదీన బీహార్ సీఎం నితీష్ కేబినెట్ లో చౌదరి మంత్రిగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.

also read:బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణం

నితీష్ పాటు ప్రమాణం చేసిన  మంత్రుల్లో చౌదరి కూడ ఉన్నారు.తారాపూర్ నుండి ఆయన జేడీ(యూ) తరపున పోటీ చేసి విజయం సాధించాడు. మేవాలాల్ కు నితీష్ కుమార్ విద్యాశాఖను కేటాయించారు.

మేవాలాల్ గతంలో భాగల్‌పూర్ వ్యవసాయ యూనివర్శిటీకి వీసీగా పనిచేశారు. ఈయన కాలంలో నిర్మించిన భవనాల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయనే  ఆరోపణలున్నాయి.లంచాలు తీసుకొని పోస్టింగ్ లు ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. మంత్రిగా చౌదరిని నియమించడంతో విపక్షాలు నితీష్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత  ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి జాతీయ గీతం తప్పుగా ఆలపించారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.అవినీతి కేసుల మంత్రికి జాతీయ గీతం కూడ ఆలపించడం రాదంటూ విపక్షాలు సెటైర్లు వేశారు.