పంజాబ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒక నవజాత శిశువుని చంపి రైలు బాత్‌రూమ్‌లో ఫ్లష్ చేశారు. వివరాల్లోకి వెళితే.. శనివారం అమృత్‌‌సర్ నుంచి హౌరా వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులోని ఏసీ కోచ్‌ను స్వీపర్లు శుభ్రం చేస్తున్నారు. ఈ క్రమంలో బాత్‌రూమ్‌ను శుభ్రపరుస్తుండగా.. వారికి టాయ్‌లెట్ ప్లేట్‌లో ఒక మగ శిశువు కనిపించింది.

బిడ్డను బయటకు తీసి చూడగా బాబు మెడ చుట్టూ ఒక తాడు కట్టి ఉంది. వెంటనే సిబ్బంది బిడ్డను దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పిల్లాడికి అత్యవసర చికిత్స అందించారు. నిపుణులతో పాటు పిడియాట్రిషియన్స్ బాబును కాపాడటానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికి అంతర్గత రక్తస్రావంతో పాటు గాయాల కారణంగా చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.

కాగా ఆ శిశువు సుమారు నాలుగు గంటల పాటు టాయ్‌లెట్ ప్లేట్ కింద ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.