Asianet News TeluguAsianet News Telugu

ద్విచక్ర వాహనదారులకు అలర్ట్.. పిల్లలకు హెల్మెట్ తప్పనిసరి.. రూల్స్ ఉల్లంఘిస్తే..

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ద్విచక్ర వాహనదారులకు సంబంధించి కొత్త సెఫ్టీ రూల్స్ జారీ చేసింది. దేశంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే పిల్లలు హెల్మెట్‌ను (helmet for Children) ధరించడం తప్పనిసరి చేసింది.

New safety rules helmet for children on bikes is mandatory
Author
New Delhi, First Published Feb 16, 2022, 4:19 PM IST

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ద్విచక్ర వాహనదారులకు సంబంధించి కొత్త సెఫ్టీ రూల్స్ జారీ చేసింది. దేశంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే పిల్లలు హెల్మెట్‌ను (helmet for Children) ధరించడం తప్పనిసరి చేసింది. ద్విచక్ర వాహనాలపై  పిల్లలను తీసుకెళ్లేటప్పుడు.. వారి సైజు ప్రకారం హెల్మెట్‌లను ధరించేలా చూసుకోవాలి. అలాగే పిల్లలతో ప్రయాణిస్తున్న సమయంలో harness belts (పిల్లలను పట్టి ఉంచేందుకు బెల్ట్‌లు) ఉపయోగించడాన్ని తప్పనిసరి చేసింది. నాలుగు సంవత్సరాల వయసు వరకు పిల్లలను బైక్‌పై తీసుకువెళుతున్నప్పుడు ఈ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. పిల్లలతో పాటు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నప్పుడు గంటకు గరిష్ఠంగా 40 కి.మీ కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించకూడదని నిబంధనల్లో పేర్కొంది. 

ఈ కొత్త నిబంధనను అతిక్రమించినట్టయితే రూ.1,000 జరిమానా విధించడంతో పాటు డ్రైవర్ లైసెన్స్‌ను 3 నెలల పాటు సస్పెండ్ చేస్తారు. అయితే ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తితో పిల్లలను పట్టి ఉంచేలా హార్నెస్ విషయంలో పాటించాల్సిన వాటిని కూడా వెల్లడించింది. హార్నెస్ తేలికగా ఉండటంతో పాటుగా, వాటర్ ఫ్రూప్, కుషన్‌తో ఉండాలని తెలిపింది. అంతేకాకుండా 30 కిలోల బరువును మోసే సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. పిల్లలతో ప్రయాణించేటప్పుడు బైక్ వేగం గంటకు 40కిమీ కంటే ఎక్కువ ఉండకుండా వాహనదారుడు నియంత్రణ పాటించాలి.

భారతదేశంలో వాహనాల నిర్వహణ కోసం చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌లో ఇటువంటి భద్రతా నిబంధనలను ప్రవేశపెట్టడానికి సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ (CMVR), 1989ని సవరించడానికి ప్రభుత్వం మొదటిసారిగా 25 అక్టోబర్ 2021న ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను తీసుకొచ్చింది. ఈ ముసాయిదాకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనల తర్వాత కేంద్ర ప్రభుత్వం నిబంధనలను పరిగణనలోకి తీసుకుంది.

పిల్లల హెల్మెట్‌లకు సంబంధించి బీఐఎస్ (Bureau of Indian Standards)  ప్రత్యేక ప్రమాణాన్ని జారీ చేస్తుందని.. అప్పటివరకు చిన్న హెల్మెట్‌లు, సైకిల్ హెల్మెట్‌లను ఉపయోగించవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios