విధానపరమైన సంస్కరణల్లో భాగంగా బొగ్గు గురించి మాట్లాడుతూ.... ఇప్పటివరకు ప్రభుత్వ గుత్తాధిపత్యంగా నడిచిన బొగ్గు నిక్షేపాల వెలికితీతను ఇక ప్రైవేట్ వ్యక్తులకు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. పూర్తిగా కమెర్షియలైజ్ చేయాలనుకుంటున్నట్టు నిర్మల సీతారామన్ తెలిపారు. 

అలానే బొగ్గు నిక్షేపాల మధ్యలో ఉండే కోల్ బెడ్ మీథేన్ ని కూడా వేలం వేయాలనుకుంటున్నట్టు తెలిపారు. ప్రపంచంలో బొగ్గు నిల్వల్లో మూడవ స్థానంలో ఉన్న మనం ఇంకా బొగ్గును దిగుమతి చేసుకోవాలిసి రావడం నిజంగా బాధాకరమని, అందుకే ప్రైవేట్ వ్యక్తులు కూడా వచ్చి ఇక్కడ పాల్గొంటే... బొగ్గును మరింత ఉత్పత్తిచేసే వీలుంటుందని ఆర్ధికమంత్రి అభిప్రాయపడ్డారు. 

బొగ్గు పర్యావరణానికి నష్టం కలిగిస్తుంది కాబట్టి, బొగ్గును లానే వాడకుండా దాన్ని గ్యాస్ రూపంలోకి మార్చేందుకు ప్రోత్సహిస్తున్నట్టు ఆమె తెలిపారు. కాల్ గ్యాసిఫికేషన్ మీద అత్యధిక దృష్టి పెడతామని, తద్వారా మన ఇంధన అవసరాలు తీరడంతోపాటుగా, మన పర్యావరణ లక్ష్యాలను కూడా చేరుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని నిర్మల సీతారామన్ అన్నారు. 

ఇలా బొగ్గును గనుక వెలికితీయగలిగితే... మనకు అవసరమైన గ్రేడెడ్ బొగ్గును మాత్రమే తెచ్చుకోగలిగే వీలుంటుందని ఆమె అన్నారు. ఇక ఇతర ఖనిజాల విషయానికి వచ్చేసరికి ఇప్పటివరకు ఉన్న పద్దతికి స్వస్తి పలుకుతూ... నిక్షేపాల అన్వేషణ, వెలికితీత, ఉత్పత్తికి సంబంధించి ఒకటే కంపోసిట్ లైసెన్స్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. 

ఇంతకుమునుపు, ఎవరైనా నిక్షేపాల అన్వేషణకు డబ్బును ఖర్చుపెడితే... తనకు ఆ ఖనిజం వెలికితీతకు లైసెన్స్ దక్కుతుందో లేదో అన్న అనుమానం ఉండేదని, కానీ... ఇప్పుడు ఆ పద్ధతి లేదని ఒకటే లైసెన్స్ ఇవ్వనున్నట్టు తెలిపారు. 

జాయింట్ వేలాలను కూడా నిర్వహిస్తామని, ఉదాహరణకు అల్యూమినియం ఇండస్ట్రీ కోసం ముడి సరుకుగా బాక్సైట్ ఖనిజంతో పాటుగా విద్యుత్ ఉత్పత్తికోసం బొగ్గును కూడా కలిపి వేలం వేస్తామని, తద్వారా ఖర్చుతగ్గి లాభాలు పెరుగుతాయని ఆమె ఈ సందర్భంగా అన్నారు. 

క్యాప్టివ్, నాన్ క్యాప్టివ్ మైనింగ్ ల మధ్య వ్యత్యాసాన్ని తొలగిస్తున్నామని... దానితోపాటుగా మైనింగ్ లీజులను కూడా బదిలీ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ఆమె తెలిపారు. అన్ని ఖనిజాలు సంబంధించి ఒక ఖనిజాల ఇండెక్స్ ను తయారుచేసే పనిలో ఖనిజ మంత్రిత్వశాఖ నిమగ్నమై ఉందని ఆమె తెలిపారు.