లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఏషియానెట్ న్యూస్‌కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించారు. ఈ ఏడాది నిర్వహించే శీతాకాల సమావేశాలకు నూతన పార్లమెంటు వేదిక అవుతుందని అన్నారు. ఇందుకోసం తాము ప్రయత్నిస్తున్నట్టు వివరించారు.
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు నిర్మాణం పూర్తి కావొచ్చిందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఈ ఏడాదిలోనే ఓపెన్ అవుతుందని చెప్పారు. ఈ ఏడాది జరిగే శీతాకాల సమావేశాల కొత్త పార్లమెంటు భవనంలోనే జరుగుతాయని ఆయన ఏషియనెట్ న్యూస్‌కు ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
స్వయం సమృద్ధ భారత దేశ కొత్త పార్లమెంటు భవనం ఎప్పుడు ప్రారంభం అవుతుందని దేశ ప్రజలు అందరూ తెలుసుకోవాలని ఆశపడుతారని ఓం బిర్లా తెలిపారు. ఇది వరకే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా రెండేళ్లలో అంటే.. ఈ ఏడాదిలో నూతన పార్లమెంటు భవన నిర్మాణం పూర్తి అవుతుందని వివరించారు. కొత్త పార్లమెంటు భవనానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఆయన శంకుస్థాపన చేసినప్పుడే.. ఈ భవన నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాలనే నిర్ణయం జరిగిందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.
కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం ప్రారంభించి రెండేళ్ల కాలం 2022తో ముగుస్తుందని ఆయన అన్నారు. ఈ ఏడాది నవంబర్ డిసెంబర్‌లో జరిగే శీతాకాల సమావేశాలు కొత్త పార్లమెంటులోనే నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. ఈ కొత్త పార్లమెంటు కాంప్లెక్స్ దేశంలోని 130 కోట్ల ప్రజల ఆశలకు ప్రతిబింబం వంటిదని తెలిపారు.
కొత్త పార్లమెంటు భవనంలో సెంట్రల్ హాల్ లేకపోవడాన్ని ఓం బిర్లా దృష్టికి తీసుకెళ్లగా.. కొత్త పార్లమెంటు భవనంలో సెంట్రల్ లాంజ్ ఉన్నదని వివరించారు. లోక్ సభ, రాజ్య సభలకు ప్రత్యేకంగా కార్యాలయాలు ఉన్నాయని తెలిపారు. అందుబాటులో ఉన్న భూమిని కొత్త పార్లమెంటు భవనానికి సంపూర్ణంగా వినియోగించుకున్నామని చెప్పారు. ఎగువ, దిగువ సభలకు ప్రత్యేక హౌజ్‌లు ఉండటమే కాదు.. కమిటీ రూములు, సెంట్రల్ లాంజ్, పబ్లిక్, మీడియా ఎంక్లోజర్లు ఉన్నాయని అన్నారు. ప్రస్తుత పార్లమెంటులో ఉన్న ప్రతీది కొత్త పార్లమెంటులో అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఇదే సందర్భంలో ప్రస్తుత పార్లమెంటు భవనం గురించి కూడా ఆయన మాట్లాడారు. పాత పార్లమెంటు భవనం ఎప్పట్లాగే ఉంటుందని, స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశ చారిత్రక ప్రయాణానికి ఈ భవనం గుర్తుగా ఉంటుందుని అన్నారు. ఇది చారిత్రక భవనం అని, ఇది ఆలయం అని కూడా తెలిపారు. స్వతంత్ర భారత దేశంలో ఈ భవనం ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకుందని అన్నారు. 75 ఏళ్ల కాలంలో దేశాన్ని ప్రజాస్వామిక దారిలో నడిపించడానికి గత ప్రభుత్వాలు ఈ భవనం కేంద్రంగానే కృషి చేశాయని చెప్పారు. ఈ భవనంలో తెచ్చిన చట్టాలు, నిర్ణయాల ద్వారానే దేశంలో ఆర్థిక, సామాజిక మార్పులు సాధ్యం అయ్యాయి అని పేర్కొన్నారు.
కాగా, కొత్త పార్లమెంటు మన ఆశలు, ఆశయాలకు ప్రతీక అని వివరించారు. స్వతంత్ర భారతానికి 100 ఏళ్లు నిండినప్పుడు ఇది ఒక స్వయం సమృద్ధ దేశంగా అవతరించాలని కలలు కంటున్నామని చెప్పారు. కొత్త పార్లమెంటు ఈ ఆశయాలను సాకారం చేస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. నూతన పార్లమెంటు భవనంలో జరిగే చర్చలు, సంవాదాలు కచ్చితంగా దేశ ప్రజలు ఉపయోగపడతాయని వివరించారు.
