న్యూఢిల్లీ: దేశంలో ఆక్సిజన్ కొరతను అతి త్వరలోనే అధిగమిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చెప్పారు.సోమవారం నాడు ఆయన న్యూఢిల్లీలో  మీడియాతో మాట్లాడారు.  దేశంలో యాక్టివ్ కేసులు 34 లక్షలు దాటాయన్నారు. దేశంలో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు పెద్ద సంఖ్యలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. కరోనాకు అడ్డుకట్టవేసేందుకు దేశంలోని 15.73 కోట్ల మందికి వ్యాక్సినేషన్ అందించామని ఆయన తెలిపారు. 

ఎంబీబీఎస్ విద్యార్థులకు కూడా కోవిడ్ డ్యూటీ వేస్తామన్నారు. ఎంబీబీఎస్ చివరి ఏడాది విద్యార్థులను సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో కోవిడ్ విధులకు ఉపయోగించుకొంటామన్నారు.ప్రస్తుతం ఉన్న వైద్య సిబ్బందిపై ఒత్తిడి తగ్గించేందుకు గాను ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన వివరించారు. మధ్యప్రదేశ్, మహరాష్ట్రల్లో కరోనా కేసులు పీక్ నుండి తగ్గుతున్నాయన్నారు.దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దీంతో  18 ఏళ్లు దాటినవారంతా వ్యాక్సిన్ వేసుకొనేందుకు కేంద్రం వెసులుబాటును కల్పించింది.అయితే  డిమాండ్ మేరకు వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడంలో  ఫార్మా కంపెనీలు  చేయలేకపోతున్నాయి.