కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దేశంలోని పలు ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఈ పరిణామంపై తీవ్రంగా స్పందించారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దేశంలోని పలు ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఈ పరిణామంపై తీవ్రంగా స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై స్పందించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ.. ట్విట్టర్ వేదికగా కేంద్రంలోని బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రోజు మన రాజ్యాంగ ప్రజాస్వామ్యం కొత్త పతానాన్ని చూశామని పేర్కొన్నారు. 

‘‘ప్రధాని మోదీ నవ భారతంలో ప్రతిపక్ష నేతలు బీజేపీకి ప్రధాన లక్ష్యంగా మారారు! నేర చరిత్ర కలిగిన బీజేపీ నేతలను మంత్రివర్గంలోకి తీసుకుంటే.. ప్రతిపక్ష నేతలను మాత్రం వారి ప్రసంగాలకు సంబంధించి డిస్‌ క్వాలీఫై చేస్తున్నారు. ఈ రోజు మన రాజ్యాంగ ప్రజాస్వామ్యం కొత్త పతానాన్ని చూశాము’’ అని మమతా బెనర్జీ ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే మమతా బెనర్జీ తన ట్వీట్‌లో ఎక్కడా కూడా రాహుల్ గాంధీ పేరును గానీ, కాంగ్రెస్ పేరును గానీ ప్రస్తావించకపోవడం గమనార్హం. 

Scroll to load tweet…

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. పార్లమెంటు నుంచి ఆయనను డిస్‌క్వాలిఫై చేశారు. 2019లో మోదీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ డిఫమేషన్ కేసులో సూరత్ కోర్టు గురువారం ఆయనను దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు వెలువడ్డ మరుసటి రోజే లోక్‌సభ సెక్రెటేరియట్ ఓ నోటిఫికేషన్‌లో ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్టుగా వెల్లడించింది. అయితే అనర్హత వేటు తీర్పు వెలువడిన రోజు నుంచే అమల్లోకి వచ్చినట్టు ఆ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఇక, ప్రస్తుతం రాహుల్ గాంధీ కేరళలోని వయానాడ్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచి విజయం సాధించారు. 

ఇక, లోక్‌సభ సెక్రెటేరియట్ నుంచి నోటిఫికేషన్‌లో.. కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీని సూరత్ కోర్ట్ ఆఫ్ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ దోషిగా తేల్చడంతో ఆయనపై అనర్హత వేటు పడిందని పేర్కొన్నారు. ఈ అనర్హత మార్చి 23వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్టు వివరించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు.