Asianet News Telugu

దురంటో.. ఒక దుర్వార్తేనా.. చార్జీలు ఇష్టారాజ్యమేనా?

డిమాండ్ ఉన్న చోటే రాబట్టుకోవాలని నానుడి.. ఇది మన రైల్వేశాఖకు బాగానే పట్టుకున్నట్లు ఉన్నది. దేశీయంగా దురంటో, రాజధాని, శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లలో ప్రయాణ చార్జీలు తమకు అనుకూలంగా పెంచేస్తున్న రైల్వేశాఖ.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు నడిచే దురంటో ఎక్స్‌ప్రెస్ రైళ్ల చార్జీలు వచ్చే నెల 15 నుంచి పెంచనున్నది. 

New fare scheme for Rajdhani, Shatabdi from 15 March 2019: 5 things to know
Author
New Delhi, First Published Feb 11, 2019, 11:32 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ప్రీమియం రైళ్లలో వచ్చేనెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న సవరించిన ఫ్లెక్సీఛార్జీల విధానంపై ప్రయాణికులు, నిపుణుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధిక ఛార్జీల భారం పూర్తిగా ఎత్తేయాల్సింది పోయి, రూట్ల వారీగా వేర్వేరు విధానం అనుసరించడం ఏమిటని తప్పుబడుతున్నారు. 

ఫ్లెక్సీఛార్జీల భారం నుంచి 15రైళ్లకు మినహాయింపు ఇవ్వగా, ఆ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి బయల్దేరే ఒక్క రైలును కూడా చేర్చలేదు. 32 రైళ్లలో ఫ్లెక్సీ ఛార్జీల్ని ఏడాదిలో మూడు నెలలు ఎత్తేయగా, ఆ ఉపశమనం ఇక్కడినుంచి రాకపోకలు సాగించే రైళ్లలో ఒక్కదానికే పరిమితమైంది. 

సికింద్రాబాద్‌ నుంచి వివిధ కేంద్రాలకు మూడు దురంటో ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ ‌- హజ్రత్‌ నిజాముద్దీన్ ‌(ఢిల్లీ), సికింద్రాబాద్‌-విశాఖపట్నం మార్గాల్లో దురంటో రైళ్లు ఉన్నాయి. ఈ రెండు రైళ్లను ఏడాది అంతా ఫ్లెక్సీఛార్జీలతోనే నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. సికింద్రాబాద్‌-ఎల్‌టీటీకి మాత్రం మూడు నెలలపాటు మినహాయింపు ఇచ్చింది. 

‘నష్టాలు ఉన్న చోట్ల ఛార్జీల బాదుడులో రాయితీలిస్తూ ఆదాయం వచ్చేచోట భారం వేయడం సరికాదు. ఉత్తరాది రాష్ట్రాల్లో నడిచే పలు రైళ్లల్లో ఫ్లెక్సీ భారం ఎత్తేశారు. మిగిలినచోట్ల ఇలా ఎందుకు చేయరు? నష్టాలు వచ్చేచోట ట్రిప్పులు తగ్గించాలి. ఆదాయం వచ్చేచోట భారం తగ్గించి, ట్రిప్పులు పెంచాలి’ అని రైల్వే నిపుణుడు ఒకరు పేర్కొన్నారు. 

ఏడాది సగటు ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) 50% లోపు ఉన్న రైళ్లలో ఫ్లెక్సీ ఛార్జీలు పూర్తిగా ఎత్తేస్తున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. ఓఆర్‌ 50-80 శాతం మధ్య ఉన్న రైళ్లలో రద్దీ లేని ఫిబ్రవరి, మార్చి, ఆగస్టులో ఫ్లెక్సీ భారం తొలగిస్తూ రైల్వేశాఖ నిర్ణయించింది. 

సికింద్రాబాద్‌-ఎల్‌టీటీ ముంబై దురంటో వారంలో దాదాపు 70 గంటలపైనే ఖాళీగా ఉంటుంది. హైదరాబాద్ నగరానికి50 కి.మీ దూరంలో ఉండే వికారాబాద్‌ వద్ద యార్డులో ఉంచుతున్నారు. రద్దీ ఉండే విశాఖ వరకు పొడిగించాలన్న అభ్యర్థనలు, రైళ్లను ఖాళీగా ఉంచకుండా పొడిగించాలన్న రైల్వేమంత్రి ఆదేశాలూ అమలు కాని పరిస్థితి నెలకొంది. 

సికింద్రాబాద్ ‌- విశాఖపట్నం మధ్య తిరుగుతున్న దురంటో రైలు 1994లో తయారైంది. పాతికేళ్లు దాటినా డొక్కు బోగీలతో నెట్టుకొస్తున్నారు. 80 శాతానికి పైగా ఆక్యుపెన్సీ రేషియో ఉంది. ఫ్లెక్సీ బాదుడు నుంచి ఈ బండికి మినహాయింపు ఇవ్వలేదు. 

ఈ రైలు వారానికి మూడు రోజులు మాత్రమే నడుస్తుంది. ప్రతి రోజూ తిప్పాలని ప్రయాణికులు కోరుతున్నారు. సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరి విశాఖపట్నానికి వెళ్లే ఈ బండిని ఫలక్‌నుమా స్టేషన్‌ నుంచి నడిపించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. తద్వారా సికింద్రాబాద్‌పై ఉన్న ఒత్తిడి కొంత తగ్గుతుందని అంటున్నారు. 

సాధారణ రైళ్లకంటే ప్రీమియంలో ఛార్జీలెక్కువ. వేగం, వసతులు, పరిశుభ్రతలో మిగతా వాటి కంటే మెరుగైనవి కావడంతో ధర ఎక్కువైనా వీటికి గిరాకీ ఎక్కువ. దీన్ని సొమ్ము చేసుకునేందుకు రైల్వేశాఖ ఫ్లెక్సీఛార్జీల విధానాన్ని మూడేళ్లక్రితం తెచ్చింది. ఇది మిశ్రమ ఫలితాలివ్వడంతోపాటు కాగ్‌ వ్యాఖ్యలతో రైల్వేశాఖ కొన్ని సవరణలు చేసింది. 

కాగ్ వ్యాఖ్యలు చేసినా ప్రీమియం రైళ్ల ధరల విషయమై దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు ప్రయోజనం దక్కలేదు. ఫ్లెక్సీ ఛార్జీల బాదుడు పూర్తిగా ఎత్తేసిన 15 రైళ్లలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన రెండింటికే మినహాయింపు లభించింది. కానీ దక్షిణ మధ్య రైల్వే నుంచి ఒక్క రైలుకూ చోటు దక్కలేదు. ఏడాదిలో మూడునెలల పాటు ఫ్లెక్సీ మినహాయింపు లభించిన 32 రైళ్లలో ఈ జోన్‌ నుంచి సికింద్రాబాద్‌-ఎల్‌టీటీ ముంబై రైలు ఒక్కటే ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios