చెన్నై:అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ఈవీఎంలను ఉపయోగిస్తామని ఈసీ మద్రాస్ హైకోర్టుకు తెలిపింది. . సుమారు 15ఏళ్ల నాటి ఈవీఎంలనే ప్రస్తుతం వాడబోతున్నారని డీఎంకె ఆరోపించింది. దీనిపై డీఎంకే నేత ఆర్‌ఎస్‌ భారతి మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 

పాత ఈవీఎంలను వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలోని సమస్యాత్మక కేంద్రాల జాబితాను ప్రకటించాలని ఆ పిటిషన్ లో కోరారు.ఈ పిటిషన్‌ను మంగళవారం ప్రధాన న్యాయమూర్తి సంజీబ్‌ బెనర్జీ నేతృత్వంలోని బెంచ్‌ విచారించింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్‌ తరఫున న్యాయవాదులు మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 11వేలసమస్మాత్మక కేంద్రాలను గుర్తించామన్నారు.

ఈ విషయమై ఈ నెల 26వ తేదీన అన్ని పార్టీలతో చర్చించినట్లు తెలిపారు. అదే విధంగా, శాంతిభద్రతల దృష్ట్యా జాబితాను ప్రకటించలేమని ఈసీ తరపు న్యాయవాదులు తెలిపారు.

పారదర్శకంగా పోలింగ్‌ నిర్వహించేందుకు 44వేల కేంద్రాల్లో వెబ్‌ కెమెరాలను అమర్చనున్నట్లు వివరించారు. ప్రస్తుత ఎన్నికల్లో 2017 తర్వాత తయారై ఈవీఎంలనే వినియోగిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్‌ నిబంధనలను సైతం పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కోర్టుకు విన్నవించారు. ఈసీ వాదనతో కోర్టు ఏకీభవించింది. విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికలను శాంతియుత వాతావరణంలో జరిపించాలని సూచించింది.