వందే భారత్ ఎక్స్‌ప్రెస్ జమ్మూకాశ్మీర్ ప్రజలకు దసరా కానుక అన్నారు ప్రధాని నరేంద్రమోడీ. న్యూఢిల్లీ-కత్రా స్టేషన్ల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు.

కత్రాలోని వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించేలా ఈ రైలును రూపొందించారు. తద్వారా ఈ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని కాశ్మీర్ అక్కాచెల్లెళ్లు, సోదరులకు ఇది తమ నవరాత్రి కానుక అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.

గురువారం న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, జితేంద్ర సింగ్, హర్షవర్థన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రైలు ఈ నెల 5వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.

ఈ హైస్పీడ్ రైలు వల్ల ఢిల్లీ నుంచి కత్రాకు ఎనిమిది గంటల్లోనే చేరుకోవచ్చు. గతంలో ఈ ప్రయాణ సమయం 12 గంటలుగా ఉండేది. ఇందుకు గాను కనిష్ట ఛార్జీ రూ.1,630 కాగా, గరిష్టంగా రూ.3,015గా నిర్ణయించారు.

వారంలో మంగళవారం తప్ప మిగిలిన అన్ని రోజుల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది. న్యూఢిల్లీలో ఉదయం 6 గంటలకు బయల్దేరి, అంబాలా కంటోన్మెంట్, లుథియానా, జమ్మూతావి స్టేషన్ల మీదుగా కత్రాకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది.

ఇప్పటికే ఢిల్లీ-వారణాసి మధ్య భారత్‌లోనే మొట్టమొదటి హైస్పీడ్ రైలు నడుస్తోంది. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా పలు నగరాల మధ్య 40 వందే భారత్ ‌ఎక్స్‌ప్రెస్ రైళ్లను రైల్వే శాఖ ప్రవేశపెట్టనుంది.