Asianet News TeluguAsianet News Telugu

అతి పెద్ద ప్లాన్ ఇదే: నితీష్ వర్సెస్ కేసీఆర్

ఓ వైపు బీహార్ లో నితీష్ కుమార్ కు వారసుడు సిద్దంగా ఉన్నారు, మరో వైపు తెలంగాణలో కేసీఆర్ కు వారసుడు తయారయ్యాడు. వచ్చే లోకసభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలో అతి పెద్ద మార్పులకు ఇప్పటికే శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

New alternative may emerge at Nationa level
Author
New Delhi, First Published Oct 16, 2018, 2:52 PM IST

న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో వచ్చే ఎన్నికల నాటికి తీవ్రమైన మార్పులు సంభవించవచ్చునని తెలుస్తోంది. కాంగ్రెసునే కాకుండా మమతా బెనర్జీ నేతృత్వంలోని తృతీయ ఫ్రంట్ ప్రయత్నాలను అడ్డుకోవడానికి పక్కా ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరుగుతున్నాయని, బీహార్ లో జెడి (యు) ఉపాధ్యక్షుడిగా ప్రశాంత్ కిశోర్ నియామకం జరిగిందని అంటున్నారు.

అంటే, ఓ వైపు బీహార్ లో నితీష్ కుమార్ కు వారసుడు సిద్దంగా ఉన్నారు, మరో వైపు తెలంగాణలో కేసీఆర్ కు వారసుడు తయారయ్యాడు. వచ్చే లోకసభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలో అతి పెద్ద మార్పులకు ఇప్పటికే శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. బిజెపిని అడ్డుకోవడానికి ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదవిని త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. దీంతో బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెసును కలుపుకుని ప్రాంతీయ పార్టీలతో తృతీయ కూటమి ఏర్పాటుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగం సిద్ధం చేస్తున్నారు.

బిజెపియేతర పక్షాల నేతలతో జనవరిలో మమతా బెనర్జీ కోలకతాలో భారీ ర్యాలీని తలపెట్టారు. ఈ పరిణామాలను గమనిస్తూ వస్తున్న బిజెపి ఎన్డీఎను బలోపేతం చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. తాము ఒంటరిగా వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సాధించకపోతే ఏం చేయాలనే విషయంపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. బిజెపి రూపొందించిన ఈ వ్యూహం ప్రకారమే అటు నితీష్ కుమార్, ఇటు కేసిఆర్ పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. 

తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలను ఆహ్వానించడం ఆ వ్యూహంలో భాగమేనని చెబుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు పూర్తిగా అనుకూల వాతావరణం ఉంది కాబట్టి ఎన్నికల్లో గెలవడం నల్లేరు మీద బండి నడకగా కేసీఆర్ భావించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తాను జాతీయ రాజకీయాల్లో మౌలిక మార్పులకు శ్రీకారం చుట్టాల్సి ఉన్నందున ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేస్తున్నానని చెప్పి, కేటీఆర్ ను తన స్థానంలో కూర్చోబెట్టే అవకాశం ఉందని అంటున్నారు. 

అదే విధంగా బీహార్ లోనూ ఇటువంటి వ్యూహమే అమలవుతున్నట్లు తెలుస్తోంది. బీహార్ శాసనసభకు లోకసభ ఎన్నికలు ముగిసిన తర్వాతనే జరుగుతాయి. అందువల్ల లోకసభ ఎన్నికల్లో నితీష్ కుమార్ కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉందని అంటున్నారు. అవసరమైతే జాతీయ రాజకీయాల్లో తన ముద్రను వేసేందుకు ప్రయత్నిస్తారని అంటున్నారు. 

బిజెపికి మెజారిటీ రాని పక్షంలో నితీష్ కుమార్ గానీ కేసీఆర్ గానీ ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అంటే, కేసీఆర్ కు, నితీష్ కుమార్ కు మధ్య జాతీయ స్థాయిలో పోటీ జరిగే అవకాశం ఉంది. ఎన్డీఎ భాగస్వామ్య పక్షంగా ఆయన కీలక పాత్ర పోషిస్తారని అంటున్నారు. వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా పర్యటించి ఎన్డీఎకు మద్దతు కూడగట్టే అవకాశం ఉంది. తన ప్రణాళికలో భాగంగా ప్రశాంత్ కిశోర్ ను తన వారసుడిగా ఆయన ఎంచుకున్నట్లు చెబుతున్నారు.

తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే పక్షంలో బీహార్ ముఖ్యమంత్రి పదవిని ప్రశాంత్ కిశోర్ కు కట్టబెడుతారని అంటున్నారు. అయితే, లోకసభ ఎన్నికలు ముగిసి, అప్పటి పరిణామాలపై ఇది ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్ కూడా చురుకైన పాత్ర పోషిస్తారని అంటున్నారు. ఎన్డీఎలో కీలక భూమిక పోషించే అవకాశం ఉందని చెబుతున్నారు. 

జాతీయ రాజకీయాల్లో నితీష్ కుమార్ ను దాటి ముందుకు వెళ్లాలంటే కేసిఆర్ శానససభ ఎన్నికల్లో మెజారిటీని సాధించాల్సి ఉంటుంది. అందుకే శాసనసభ ఎన్నికలు కేసిఆర్ కు అగ్నిపరీక్షలాంటివి. ప్రస్తుతానికి టీఆర్ఎస్ బలంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ కాంగ్రెసులోని నాయకుల మధ్య ఒనగూరిన ఐక్యత, మహా కూటమి ఏర్పాటు ఏ మేరకు ఫలితాలను ప్రభావితం చేస్తాయనేది ఇప్పుడే చెప్పలేని స్థితి.

ఇప్పటికైతే ఈ ప్రణాళికను అమలులో పెట్టినట్లు పెద్ద యెత్తున ప్రచారం జరుగుతోంది. తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు, వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో జరిగే లోకసభ ఫలితాలు ఈ పరిస్థితులను ఎటు తీసుకుని వెళ్తాయనేది తేలుస్తాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios