ఢిల్లీలో వరదలతో ప్రజల ఇబ్బందులు: బెంగుళూరుకు కేజ్రీవాల్ టూర్ పై నెటిజన్ల ఫైర్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెంగుళూరులో విపక్ష పార్టీల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లడంపై నెటిజన్లు మండిపడ్డారు.ఢిల్లీలో వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా సీఎం బెంగుళూరు టూర్ పై విమర్శలు చేశారు.

న్యూఢిల్లీ: ఢిల్లీలో వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో బెంగుళూరులో విపక్ష పార్టీల సమావేశానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెళ్లడంపై నెటిజన్లు మండిపడ్డారు.బెంగుళూరులో ఇవాళ , రేపు విపక్ష పార్టీల సమావేశాలు జరగనున్నాయి.ఈ సమావేశానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బయలు దేరారు. భారీ వర్షాలు, యమున నదికి భారీ వరదలతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ఢిల్లీ నగర రోడ్లలో ఇంకా వర్షం నీరు ఇంకా ఉంది. వరద నీటిలోనే వాహనాలు వెళ్తున్నాయి. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
ఈ సమయంలో ఢిల్లీ సీఎం ప్రజల సమస్యలను పట్టించుకోకుండా విపక్ష పార్టీల సమావేశానికి వెళ్లడాన్ని బీజేపీ నేత వీరేంద్ర సచ్ దేవ్ తప్పుబట్టారు. ఓ అవినీతి పరుడు మొత్తం అవినీతిపరుల సైన్యాన్ని కలిసేందుకు వెళ్లాడని ఆరోపించారు. అవినీతిపరుడైన కేజ్రీవాల్ ఢిల్లీని విడిచిపెట్టి మోసగాళ్ల కూటమికి చేరిపోయారని కుల్జీత్ సింగ్ చాహల్ విమర్శించారు. ఢిల్లీ ప్రజలు క్షమించరని చాహల్ పేర్కొన్నారు.
యమునా నది నీటి మట్టం పెరిగి ఢిల్లీ వాసులు ఇబ్బంది పడుతుంటే కేజ్రీవాల్ ఢిల్లీ వదిలి వెళ్లిపోవడాన్ని ప్రవీణ్ సాహెబ్ సింగ్ తప్పుబట్టారు. ఢీల్లీ ప్రజల పట్ల కేజ్రీవాల్ ఎలా ఆలోచిస్తున్నారో ఈ ఘటన తెలుపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఢీల్లీ మునిగిపోయిన సమయంలో రాజకీయాలు చేయడం కోసం వెళ్లడం ఎందుకని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ప్రశ్నించారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్ పీ సింగ్ .
వరదలతో ఢిల్లీ వాసులు ఇబ్బందులు పడుతుంటే చిల్లర రాజకీయాలు చేసేందుకు కేజ్రీవాల్ బెంగుళూరుకు వెళ్లడాన్ని బీజేపీ నేత విష్ణుమిట్టల్ తప్పుబట్టారు. ప్రధాని, కేంద్ర మంత్రుల టూర్లను ఆప్ ప్రశ్నించడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు.