ప్రముఖ సినీ నటి, మండ్య స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీష్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అందుకు ఆమె చేసిన ట్వీటే కారణం. ఇలాంటి ట్వీటా ఈ సమయంలో చేయాల్సింది అంటూ... ఆమెపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే.... కేంద్ర మాజీ విదేశాంగ శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి ఆమె గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె మృతి కారణంగా పార్టీ నేతలంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రధాని మోదీ అయితే ఏకంగా కన్నీరే పెట్టుకున్నారు.

సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ పోస్టులు పెడుతున్నారు. విదేశీ మంత్రులు కూడా ఇలాంటి సందేశాలు పెట్టడం విశేషం.అయితే.. ఇలాంటి సమయంలో... సుష్మా స్వరాజ్ మృతి విషయాన్ని పక్కన పెట్టి వేరే పోస్టు పెట్టారు సుమలత.

ఢిల్లీలో కర్నాటక భవన్‌లో సీఎం యడియూరప్ప, కేంద్ర మంత్రులు డీవీ సదానందగౌడ తదితరులతో సమావేశంలో పాల్గొన్న ఫోటోను అర్ధరాత్రి 12:18 గంటల సమయంలో సుమలత అప్‌లోడ్‌ చేశారు. దీనిపై పలువురు బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రీ ట్వీట్‌లు చేశారు. దేశానికి ఎంతో సేవ చేసిన సుష్మా స్వరాజ్‌ మృతి చెందితే ఆమెను జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయంలో ఈ ట్వీట్‌ చేయడం అంత అవసరమా మేడం? అని ఒక నెటిజన్‌ ప్రశ్నించారు. దీంతో బుధవారం ఉదయం సుష్మా స్వరాజ్‌ మరణం దేశానికి తీరని లోటు అని సుమలత ట్వీట్‌ చేశారు.