Panaji: గోవాలో యోగా రిట్రీట్ కోసం వచ్చిన 29 ఏళ్ల డచ్ మహిళను రిసార్ట్ సిబ్బంది లైంగికంగా వేధించి కత్తితో పొడిచారు. ఈ ఘటన ఉత్తర గోవాలోని పెర్నెమ్ పట్టణంలో చోటుచేసుకుంది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.
Dutch tourist molested, stabbed at Goa resort: విదేశీ పర్యాటకురాలిపై గోవాలో దాడి జరిగింది. ఆమెను వేధింపులకు గురిచేయడంతో పాటు కత్తితో దాడి జరిగిందనీ, ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. నెదర్లాండ్స్ కు చెందిన ఒక మహిళా పర్యాటకురాలిపై దాడి చేసిన కేసులో గోవాలోని ఓ హోటల్ లో బార్ టెండర్ గా పనిచేస్తున్న వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడిని డెహ్రాడూన్ కు చెందిన అభిషేక్ వర్మ (27)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మాండ్రేమ్లోని విగ్వామ్ రిసార్ట్ లో మంగళవారం, బుధవారం మధ్య అర్ధరాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ (నార్త్ గోవా) నితిన్ వల్సన్ వీడియాకు తెలిపారు.
బెదిరింపులకు గురిచేస్తూ..
హోటల్ ఆవరణలోని తన అద్దె గుడారంలోకి 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న గుర్తుతెలియని వ్యక్తి చొరబడ్డాడని డచ్ పర్యాటకురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. తాను కేకలు వేయడంతో ఆ వ్యక్తి తనను పట్టుకునేందుకు ప్రయత్నించాడని, చంపేస్తానని బెదిరించాడని ఆమె తెలిపింది. అరుపులు విన్న స్థానిక వ్యక్తి ఆమెను కాపాడేందుకు రావడంతో దుండగుడు పారిపోయాడు. ఆ తర్వాత కత్తితో తిరిగి వచ్చి ఆమెతో పాటు స్థానికుడిపై దాడి చేసి పరారయ్యాడు.
మహిళతో పాటు స్థానిక వ్యక్తిపై కత్తితో దాడి..
మొదట అక్కడి నుంచి పారిపోయిన దుండగుడు మళ్లీ వచ్చి విదేశీ పర్యాటకురాలితో పాటు ఒక స్థానిక వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. అతిక్రమణ, గౌరవానికి భంగం కలిగించడం, హత్యాయత్నం, తీవ్రంగా గాయపరచడం వంటి నేరాలకు సంబంధించిన పలు సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా పెర్నెం పోలీసులు అభిషేక్ వర్మను అరెస్టు చేశారు. ఈ ఘటనపై నెదర్లాండ్స్ రాయబార కార్యాలయం దృష్టి సారించగా డచ్ అధికారులు గోవా చేరుకున్నారు.
ఒక వారం క్రితం, ఒక రష్యన్ మహిళపై దాడి చేసినందుకు ఉత్తర గోవా ప్రాంతం నుండి ఒక హోటల్‌లోని ఇద్దరు సిబ్బందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపినట్టు పీటీఐ నివేదించింది. అదేవిధంగా, ముంబయి నుంచి వచ్చిన పర్యాటకుల బృందంపై కూడా రాష్ట్రంలోని అంజునా ప్రాంతంలో కత్తులు-కర్రలతో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. హోలీ వేడుకల సందర్భంగా ఢిల్లీలో జపాన్ మహిళను కొందరు వ్యక్తులు వేధించడం భారతదేశంలో మహిళా పర్యాటకుల భద్రతపై ప్రశ్నను లేవనెత్తిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
