భారత నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు షాక్.. పాస్‌వర్డ్ షేరింగ్ బంద్
భారత యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ షాక్ ఇచ్చింది. ఇక పై పాస్‌వర్డ్ షేరింగ్ కుదరదని స్పష్టం చేసింది. కేవలం తమ కుటుంబ సభ్యులకు మాత్రమే పాస్‌వర్డ్ షేరింగ్‌ను పరిమితం చేస్తున్నట్టు నెట్‌ఫ్లిక్స్ గురువారం వెల్లడించింది. కుటుంబానికి వెలుపల పాస్‌వర్డ్‌లను పంచుకుంటున్నవారికి ఇప్పటికే మెయిల్స్ పంపినట్టు తెలిపింది.

న్యూఢిల్లీ: ప్రముఖ ఓటీటీ కంపెనీ నెట్‌ఫ్లిక్స్ భారత యూజర్లకు షాక్ ఇచ్చింది. పాస్ వర్డ్ షేరింగ్ వెసులుబాటును తొలగిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. సింగిల్ అకౌంట్ పాస్‌వర్డ్ షేరింగ్ సౌకర్యం కేవలం కుటుంబ సభ్యులకే ఉంటుందని వివరించింది.
గత నెల నెట్‌ఫ్లిక్స్ ఆశించిన లాభాలను రాబట్టుకోలేదు. దీంతో యూజర్ షేరింగ్ పాస్‌వర్డ్‌లపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే సుమారు 100 దేశాల్లో పాస్‌వర్డ్ షేరింగ్ సౌకర్యాన్ని ఎత్తేసింది. ఇందులో భాగంగా ఓటీటీకి కీలకమైన మార్కెట్లు యూఎస్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ,ఆస్ట్రేలియా, సింగపూర్, మెక్సికో, బ్రెజిల్ వంటి దేశాల్లో ఈ ఆంక్షలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. దీంతో కొత్తగా మరో 60 లక్షల సబ్‌స్క్రైబర్లు నెట్‌ఫ్లిక్స్ పెరగడం గమనార్హం.
నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న నిర్ణయం తాజాగా ఇండియాలో అమలు చేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులు ఒకే అకౌంట్ పాస్‌వర్డ్‌లను షేర్ చేసుకోవచ్చని నెట్‌ఫ్లిక్స్ తన ప్రకటనలో తెలిపింది. ఆ కుటుంబ సభ్యులు ఇంటిలో ఉన్నా, బయటికి వెళ్లినా, హాలీడేలకు వెళ్లినా ఈ సౌకర్యాన్ని పొందవచ్చని వివరించింది. కుటుంబానికి కాకుండా బయటి వారికి పాస్‌వర్డ్ షేర్ చేసుకుంటున్న వారికి ఇప్పటికే మెయిల్స్ పంపి ఈ విషయాన్ని తెలియజేసినట్టు పేర్కొంది.
Also Read: ‘సామజవరగమన’ OTT రిలీజ్ డేట్..అంత త్వరగానా?
తమ సభ్యులకు ఎంటర్‌టైన్‌మెంట్ చాయిస్‌లను విరివిగా అందుబాటులోకి ఉంచనున్నట్టు వివరించింది. ఇందుకోసమే తాము కొత్త చిత్రాలు, టీవీ షోల కోసం పెట్టుబడులు కొనసాగిస్తున్నట్టు తెలిపింది. కాబట్టి తమ సభ్యులు ఏ భాష వారైనా.. ఎక్కడివారైనా వారి మూడ్‌కు తగినట్టుగా అన్ని రకాల వినోదాలను అందుబాటులో ఉంచుతున్నట్టు పేర్కొంది.