అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తెప్పించలేమని భావించి రక్తానికి.. రక్తమే అన్నట్లుగా పోరాటాన్ని నడిపారు నేతాజీ సుభాష్ చంద్రబోస్. భారత స్వతంత్ర సంగ్రామంలో ఆ మహనీయుడు పోషించిన పాత్ర, భారతీయులపై వేసిన ముద్ర మరువలేనిది.

ఈ నేపథ్యంలో ఆయన పుట్టినరోజు నాడు ఏటా ఘన నివాళులర్పించేందుకు మోడీ సర్కార్ సిద్ధమైంది. నేతాజీ జయంతి (జనవరి 23) నాడు ప్రతి ఏడాది పరాక్రమ దివస్‌గా జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

భారతీయుల ప్రియతమ నేత, దేశం కోసం నిస్వార్థంగా పనిచేసిన నాయకుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించామని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

2021 నుంచి ఆయన జయంతిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ‘పరాక్రమ దివస్‌’గా నిర్వహించనున్నామని వెల్లడించింది. దేశ ప్రజల్లో ముఖ్యంగా యువతలో స్ఫూర్తిని నింపి వారిలో దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.

మరోవైపు ఈసారి ఆయన జయంతికి రాజకీయ ప్రాధాన్యం కూడా ఏర్పడే అవకాశం ఉంది. అప్పట్లో నేతాజీ స్వతంత్ర పోరాటానికి కేంద్రంగా ఉన్న కోల్‌కతాలో.. ఈ జనవరి 23న ఆయనకు నివాళులర్పించేందుకు ప్రధాని మోదీ పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అదే రోజు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతాజీకి నివాళిగా పాదయాత్ర నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో ఈ రెండు పార్టీల మధ్య ప్రస్తుతం తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతున్న నేపధ్యంలో నేతాజీ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.