కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నేటి నుంచి సమ్మెకు దిగారు. దీంతో అనేక ప్రభుత్వ సేవలపై ప్రభావం పడనుంది. సమ్మెను ఆపేందుకు సీఎం బసవరాజ్ బొమ్మై మంగళవారం అర్ధరాత్రి వరకు ఉద్యోగులతో సమావేశం జరిపారు. కానీ చర్చలు విఫలమవడంతో సమ్మెకు దిగేందుకే మొగ్గు చూపారు.
కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (కేఎస్‌జీఈఏ) మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో బుధవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఉద్యోగులతో సీఎం మంగళవారం అర్ధరాత్రి వరకు మాట్లాడారు. కానీ నిరసనను ఉపసంహరించుకోవడానికి సిబ్బంది నిరాకరించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి.
‘నా భార్యకు భరణం ఇవ్వాలి.. కిడ్నీ అమ్మేస్తా కొనండి.. లేదంటే ఆత్మాహుతి కార్యక్రమమే...’
7వ వేతన సంఘం ప్రకారం వేతనాలు సవరించాలని, కొత్త పెన్షన్ విధానం (ఎన్పీఎస్) ఉపసంహరించుకోవాలని ఆరు లక్షల మంది ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అసోసియేషన్ డిమాండ్ చేసింది. వేతన సవరణపై మధ్యంతర పరిష్కారం ప్రకటించడానికి తనకు పది రోజులు మాత్రమే అవసరమని బొమ్మై అసోసియేషన్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఎన్‌పీఎస్‌పై, పాత పెన్షన్ విధానాన్ని పునఃప్రారంభించడంపై అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు బొమ్మై తెలిపారు. కానీ అసోసియేషన్ వెంటనే తన నిరసన పిలుపును ఉపసంహరించుకోలేదు.
దీనిపై అసోసియేషన్ అధ్యక్షుడు సిఎస్ షదాక్షరి మాట్లాడుతూ.. ‘‘ ఆయనను నమ్మాలని సీఎం కోరారు. పది రోజుల్లో మధ్యంతర పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తమకు వ్యతిరేకం కాదని చెప్పారు. అయితే మా డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. కానీ మేము వాటిని అంతర్గతంగా చర్చించాల్సిన అవసరం ఉంది ’’అని అన్నారు. పరిస్థితులు యథాతథంగా కొనసాగుతాయని చెప్పారు.
కాగా.. ఉద్యోగులు సమ్మెకు దిగడంతో రవాణా, శ్మశానవాటికలు, క్రిటికల్ కేర్ ఆస్పత్రులు వంటి కొన్ని అత్యవసర సేవలు మినహా మేజర్, మైనర్ సర్వీసులు దెబ్బతిన్నాయి. సమ్మె వల్ల అన్ని ఆరోగ్య సేవలు, పాఠశాల, పీయూ కళాశాల పరీక్షలు, అన్ని కార్పొరేషన్లలో చెత్త సేకరణ, విద్యుత్ నిర్వహణపై ప్రభావం పడే అవకాశం ఉంది.
మార్చి 1న భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. నేటినుంచే అమల్లోకి.. ఏది ఎంత పెరిగిందంటే...
ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి బొమ్మై విలేకరులతో మాట్లాడుతూ.. అసోసియేషన్ ఒప్పుకుంటుందన్న నమ్మకం ఉందన్నారు. కోవిడ్ సమయంలో సకాలంలో జీతాలు ఎలా చెల్లించామో, ఇచ్చిన డీఏ పెంపును వారికి వివరించానని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తదనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని తాను చెప్పానని, త్వరలోనే మధ్యంతర నివేదిక ఇవ్వాలని రిటైర్డ్ అధికారి సుధాకర్ రావు నేతృత్వంలోని 7వ వేతన సంఘాన్ని మరోసారి ఎస్ వైకి కోరతానని చెప్పారు. కాగా.. ఏడో వేతన సంఘం వేతనాల అమలుతో తొలి ఏడాదిలోనే ఖజానాపై రూ.12 వేల నుంచి రూ.17 వేల కోట్ల భారం పడుతుందని అంచనా.
