NEET 2023: దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ముగిసింది. అయితే నీట్ పరీక్షకు కఠిన నిబంధనలు అమలు చేయడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
NEET 2023: జాతీయస్థాయిలో వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ (NEET UG 2023) పరీక్ష ఆదివారం (May 7) ప్రశాంతంగా ముగిసింది. పెన్ను, పేపర్ విధానంలో నిర్వహించిన ఈ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు జరిగింది. దేశవ్యాప్తంగా 499 నగరాలు/పట్టణాలతో సహా, విదేశాల్లోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి 68,022 మంది నీట్ పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణ నుంచి 70 వేల మంది హాజరైనట్టు సమాచారం. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ( NEET UG 2023 )కోసం మొత్తం 20,87,449 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు.
పరీక్ష హాల్లోకి ప్రవేశించే ముందు విద్యార్థులను చాలా క్షుణంగా పరిశీలించారు. ముక్కు పుడకలున్న అమ్మాయిలను అధికారులు గేట్ల వద్దే నిలిపివేశారు. దీంతో వాటిని తీసివేసి లోపలికి వెళ్లారు. మరికొంత మంది విద్యార్థుల ముక్కుపుడకలు రాకపోవడంతో వాటిని కట్ చేసి లోనికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇంకా కొన్ని చోట్ల ఫుల్ హ్యాండ్స్ డ్రెస్సులు వేసుకున్న విద్యార్థులను కూడా అడ్డుకుంటున్నారు. కొన్ని సెంటర్ల వద్ద అమ్మాయిలు హెయిర్ బ్యాండ్స్, గాజులను తీసివేయి లోనికి వెళ్లాల్సిన పరిస్థితి. కేవలం అప్లికేషన్ ఫామ్,ఆధార్ కార్డును మాత్రమే లోనికి తీసుకెళ్లడానికి అనుమతించారు.
మరికొన్ని నీట్ పరీక్ష కేంద్రాల వద్ద బయోమెట్రిక్ ఆలస్యమైంది. దీంతో విద్యార్థులు క్యూలైన్లలో ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. మొత్తం మీద విద్యార్థులను కుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే విద్యార్థులను అధికారుులు లోపలికి అనుమతించారు. అయితే నీట్ పరీక్షకు కఠిన నిబంధనలు అమలు చేయడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవేం రూల్స్ అంటూ మండిపడ్డారు.
ఇదిలా ఉంటే.. మణిపూర్‌లో హింసతో కూడిన పరిస్థితులు కొనసాగుతున్నందున విద్యార్థులు పరీక్షకు హాజరుకావడం కష్టతరమైనందున NEET UG వాయిదా పడింది.
