నీట్ ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. టాప్ ర్యాంకర్ల పేర్లు కూడా ఇప్పటికే విడుదల చేశారు. అయితే.. ఈ నీట్ పరీక్షలో ఇద్దరికి మార్కులు ఒకేలా వచ్చాయి. కానీ వారికి ర్యాంకులు మాత్రం సేమ్ ఇవ్వలేదు. మీరు చదివింది నిజమే.. ఒడిశాకు చెందిన షోయబ్ అఫ్తాబ్.. 720 సాధించి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు కొట్టేశారు. అయితే.. ఢిల్లీకి చెందిన ఆకాంక్షా సింగ్ కూడా 720 మార్కులు సాధించారు. కానీ రెండో ర్యాంకుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కారణం.. ఆమెకు షోయెబ్ కంటే తక్కువ వయసుండటమే. 

వయసుని బట్టి ర్యాంకులు మార్చేస్తారా అనే సందేహం మీకు కలగొచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి కారణం నీట్‌లో అమలవుతున్న టై బ్రేకర్ పాలసీ. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఓకే రకం మార్కులు సాధించిన సందర్భాల్లో టై బ్రేకర్ పాలసీ ద్వారా వారికి ర్యాంకు కేటాయింపు జరుగుతుంది. 

‘సాధారణంగా విద్యార్థులు బయాలజీ, కెమ్రిస్ట్రీ సబ్జెక్టుల్లో సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంకు కేటాయింపు జరుగుతుంది. అయితే..వీటిల్లో ఒకే రకం మార్కులు వచ్చిన సందర్భాల్లో స్టూడెంట్లు ఎన్ని తప్పు సమాధానాలు ఇచ్చారన్న దానిపై వారి ర్యాంకు ఆధారపడుతుంది. తప్పుల సంఖ్య కూడా ఒకటే అయితే అప్పుడు విద్యార్థుల వయసును పరిగణలోకి తీసుకుంటారు.

ఎక్కువ వయసున్న అభ్యర్థులకు మొదటి ర్యాంకు వస్తుంది’ అని ఈ విషయాలతో సంబంధం ఉన్న అధికారి ఒకరు తెలిపారు. ఇదే విధానం ద్వారా తుమ్మల నిఖిత(తెలంగాణ), వినీత్ శర్మ(రాజస్థాన్), అమ్రీషా ఖైతాన్(ఖైరతాబాద్), గుత్తి చైతన్య సింధు(ఆంధ్రప్రదేశ్) ర్యాంకుల ఖరారయ్యాయి. వీరందరూ 715 మార్కులు సాధించినప్పటికీ టై బ్రేకర్ విధానం ద్వారా వేరు వేరు ర్యాంకులు వచ్చాయి.