ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా ఓ ప్రచారం చిత్రంలో తళుక్కున మెరిశారు. బల్లెం విసరడంలోనే కాదు, నటనలోనూ తనకు నైపుణ్యమున్నదని నిరూపించుకున్నారు. గోల్డ్ మెడల్ గెలుచుకున్న తర్వాత ఆయన పాపులారిటీని వివరిస్తూనే ఓ క్రెడిట్ కార్డ్ యాడ్ చిత్రంలో భిన్నపాత్రలు పోషించారు. ఈ వీడియోను స్వయంగా ఆయనే పోస్టుచేశారు. తన నటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

న్యూఢిల్లీ: భారత బంగారు క్రీడాకారుడు నీరజ్ చోప్రా కెమెరా ముందు తన నటనా కౌశలాన్ని చూపి అభిమానులందరికీ సర్‌ప్రైజ్ షాక్ ఇచ్చారు. జావెలిన్ విసరడమే కాదు.. యాక్టింగ్ చేయడంలోనూ తన స్కిల్‌ను వెల్లడించారు. ఓ క్రెడిట్ కార్డ్ బ్రాండ్ ప్రచార చిత్రం కోసం ఆయన కెమెరా ముందుకు వెళ్లారు. ఆ యాడ్‌లో అద్భుతంగా నటించారు. తొలిసారి చూసేవారెవరికీ అతను నీరజ్ చోప్రా అని గుర్తుపట్టడం దాదాపు అసాధ్యమే. మూడు నాలుగు క్యారెక్టర్‌లలో యాక్ట్ చేసి కేక పుట్టించారు. ఆయన స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో ఆ వీడియోను పోస్ట్ చేయడంతో నెటిజన్లు విరబడి చూస్తున్నారు. అంతేకాదు, ఆయన యాక్టింగ్ స్కిల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Scroll to load tweet…

టోక్యో ఒలింపిక్స్‌లో రికార్డులు తిరగరాస్తూ బంగారు పతకాన్ని భారత్‌కు సాధించిపెట్టిన నీరజ్ చోప్రాకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. ఎంతోమంది యువతకు ఆయన ఆదర్శంగా మారారు. టోక్యో నుంచి భారత్‌లో అడుగుపెట్టగానే ఎన్నో కార్యక్రమాలకు హాజరయ్యారు. ఇంటర్వ్యూలో, సన్మాన సత్కారాలకు లెక్కే లేకుండా పోయింది. ఈ సందర్భంగానే తాను యాక్ట్ చేసిన యాడ్‌లోనూ ఇదే నేపథ్యాన్ని తీసుకున్నారు. గోల్డ్ గెలుచుకున్న తర్వాత తన పాపులారిటీని వివరిస్తున్న యాడ్‌లో స్వయంగా ఆయనే డిఫరెంట్ రోల్స్‌లో యాక్ట్ చేశారు.

ఈ వీడియోను నీరజ్ చోప్రా ట్విట్టర్‌లో పోస్టు చేసి క్రీడాభిమానులకు సరికొత్త ట్రీట్ ఇచ్చారు. యూఏఈలో 2021 ఐపీఎల్ ప్రారంభానికి గంటల ముందే వీడియో పోస్టు చేయడంతో అభిమానుల జోష్ రెండింతలైంది.

ఆ క్రెడిట్ కార్డ్ బ్రాండ్ ఇప్పటికే రాహుల్ ద్రవిడ్‌తో యాడ్‌ చిత్రించింది. తర్వాత టీమిండియా 90వ దశకం ప్లేయర్‌లతోనూ ప్రచారచిత్రాలు రూపొందించింది. తాజాగా, నీరజ్ చోప్రాను అందుకు ఎంపిక చేసుకుని మరోసారి సరైన గురిని సాధించింది.