దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు ప్రధాని మోడీ. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మంగళవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాను భారత్ ధైర్యంగా ఎదుర్కొందని మోడీ పేర్కొన్నారు. కానీ ప్రజలు కరోనా వైరస్‌ను తేలిగ్గా తీసుకుంటున్నారని.. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే వుందని మోడీ చెప్పారు.

ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు పీఎం కేర్ ఫండ్స్ వినియోగించామని.. పరీక్షల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం వుందని ప్రధాని వెల్లడించారు. కొందరి నిర్లక్ష్యం వల్లే కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. తుఫాను పరిస్ధితు వల్ల ఏపీ సీఎంతో మాట్లాడలేకపోయానన్నారు. 

ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. శాస్త్రీయంగా ఆమోదింపబడిన వ్యాక్సిన్ ను ప్రజలకు అందించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం కూడా ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దీనికి అనుగుణమైన కార్యాచరణను రూపొందించామని తెలిపారు.  

ఈ వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. కరోనా వైరస్ కూడా దేశమంతటి పైనా ఒకే రకమైన ప్రభావం చూపని విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

వ్యాక్సిన్ కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టీ మొదట రాష్ట్రానికి కొన్ని చొప్పున వ్యాక్సిన్ డోసులు పంపి వాటిని కొంతమందికి ఇవ్వాలని ఆయన కోరారు. పది, పదిహేను రోజులు పరిస్థితిని పరిశీలించి తర్వాత మిగతా వారికి ఇవ్వాలన్నారు