లోక్ సభ స్పీకర్ గా మళ్లీ ఓంబిర్లానే... ఇండియా కూటమికి తప్పని ఓటమి
ఏకగ్రీవ సాంప్రదాయానికి తెరపడి యాబై ఏళ్ల తర్వాత జరిగిన లోక్ సభ స్పీకర్ ఎన్నికల్లో ఎన్డిఏ కూటమి విజయం సాధించింది. ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థి సురేష్ పై ఓం బిర్లా విజయం సాధించారు.
Lok Sabha Speaker Election 2024 : లోక్ సభ స్పీకర్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. సభలో సంఖ్యాబలం కలిగిన ఎన్డిఏ కూటమి లోక్ సభ స్పీకర్ ఎన్నికల్లో గెలిచింది. మాజీ స్పీకర్ ఓం బిర్లాకే మరోసారి సభను నడిపే అవకాశం దక్కింది. ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేష్ ఓటమి పాలయ్యారు.
లోక్ సభ స్పీకర్ పదవి అధికార పార్టీకే దక్కడం ఆనవాయితీ. వారికి సంఖ్యాబలం వుంటుంది కాబట్టి ప్రతిపక్షాలు పోటీలో నిలిచేవి కాదు. కాబట్టి స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరుగుతుండేది... ఇది లోక్ సభ సాంప్రదాయంగా మారిపోయింది. ఇలా ఎప్పటిలాగే స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డిఏ ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ఇండియా కూటమి పోటీకే మొగ్గుచూపింది... తమ అభ్యర్థిని బరిలోకి దింపింది. దీంతో అర్ధశతాబ్దం తర్వాత లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నికలు జరిగాయి.
మంగళవారం ఓం బిర్లాను స్పీకర్ గా ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జెపి నడ్డాలతో పాటు ఎన్డిఏ మిత్రపక్ష పార్టీల నాయకులు నామినేషన్ దాఖలుచేసారు. ఇక కేరళ ఎంపీ సురేష్ తరపున ఇండియా కూటమి నాయకులు నామినేషన్ దాఖలు చేసారు. దీంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. దీంతో ఇవాళ సీక్రెట్ బ్యాలట్ ద్వారా ఎన్నిక జరిగింది... లోక్ సభ ఎంపీలంతా ఓటుహక్కును వినియోగించుకున్నారు. అయితే సభలో ఎన్డిఏకే మెజారిటీ వుండటంతో 50శాతానికి పైగా ఓట్లతో ఓంబిర్లా విజయం సాధించారు.
18వ లోక్ సభ స్పీకర్ గా మళ్లీ ఓం బిర్లానే నియమించాలన్న ఎన్డిఏ ప్రతిపాదనను ముందు ఇండియా కూటమి అంగీకరించింది. కానీ డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమి కోరింది. ఇందుకు ఎన్డిఏ కూటమి ఒప్పుకోకపోవడంతో స్పీకర్ ఏకగ్రీవానికి ప్రతిపక్షాలు కూడా అంగీకరించలేదు. తమ అభ్యర్థిని బరిలోకి దింపడంతో ఏకగ్రీవ సాంప్రదాయానికి తెరపడి స్పీకర్ ఎన్నిక జరిగింది.
స్వాతంత్య్ర భారతదేశంలో ఇప్పటివరకు కేవలం రెండుసార్లు మాత్రమే లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నికలు జరిగాయి. 1952లో మొదటి లోక్ సభ స్పీకర్ పదవి ఎన్నికలు జరిగాయి... ఇందులో కాంగ్రెస్ బలపర్చిన జివి మౌలాంకర్ విజయం సాధించి తొలి స్పీకర్ గా మారారు. ఆ తర్వాత 1976 లో మరోసారి స్పీకర్ పదవి కోసం ఎన్నికలు జరిగాయి. ఇందులో జనసంఘ్, కాంగ్రెస్ పార్టీలు పోటీపడ్డాయి... చివరకు కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ స్పీకర్ పదవికోసం ఎన్నికలు జరగలేదు... అధికార, ప్రతిపక్షాలు ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సాంప్రదాయంగా మారింది. కానీ ఇప్పుడు మూడోసారి లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నికలు జరిగాయి.