ఢిల్లీలోని చైల్డ్ కేర్ హోమ్స్ నుంచి పిల్లలు పారిపోతున్నా ఈ విషయాన్ని తమకు ఎందుకు చెప్పలేదని జాతీయ బాలల హక్కుల పరిరక్ష కమిషన్ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి గల కారణాలను వెంటనే తమకు నివేదిక రూపంలో తెలియజేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దేశ రాజధాని ఢిల్లీ (delhi) లోని బాలల సంరక్షణ సంస్థల నుంచి పిల్లలు పారిపోతున్నారనే విషయంపై తెలియజేయనందుకు అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) ప్రభుత్వంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి వెంటనే వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గత నివారం ఢిల్లీ బడ్జెట్ (budget) వివరాలు తెలియజేసేందుకు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీధి పిల్లల కోసం ప్రత్యేకంగా రూ. 10 కోట్లు కేటాయించామని తెలిపారు. వారి కోసం అత్యాధునిక పాఠశాలను నిర్మిస్తామని చెప్పారు. అందులో వారికి అన్ని సౌకర్యాలు లభిస్తాయని చెప్పారు. ఇంత వరకు వీధి బాలలను పట్టుకొని చైల్డ్ కేర్ హోమ్‌లలో ఉంచామని అన్నారు. అయితే వారిని అక్కడ సరిగా చూసుకోలేదని తెలిపారు. వారిని పారిపోయే విధంగా ప్రేరేపించారని కేజ్రీవాల్ చెప్పారు.
అయితే మీడియా సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించిన వివరాల్లో చైల్డ్ కేర్ హోమ్స్ ( child care homes) నుంచి చిన్నారులు పారిపోతున్నారనే విషయం ప్రస్తావనకు రావడంతో NCPCR చైర్‌పర్సన్ ప్రియాంక్ కనూంగో (Priyank Kanoongo) స్పందించారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షన కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో నెలవారీగా నాలుగు సమావేశాలు నిర్వహిస్తుంటుందని తెలిపారు. అయితే ఢిల్లీ ప్రభుత్వంలోని మహిళా, శిశు అభివృద్ధి శాఖ తమకు ఎప్పుడూ సంరక్షణ గృహాల నుంచి పిల్లలు పారిపోతున్నారనే విషయాన్ని తెలియజేయలేదని అన్నారు. దీనిపై వివరణ కావాలని కోరారు.
‘‘ ఎన్ సీపీసీఆర్ నిర్వహించే నెలవారీ సమీక్షా సమావేశాల్లో ఢిల్లిలోని సంరక్షణ గృహాల నుంచి పిల్లలు పారిపోతున్నారనే తీవ్రమైన విషయాన్ని మాకు తెలియజేయకపోవడానికి గల కారణాలను మీ మంచి కార్యాలయాలు అందించాలని NCPCR కోరుతోంది’’ అని ప్రియాంక్ కనూంగో తెలిపారు. ఢిల్లీలోని చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్‌ల అధ్వాన్న స్థితి, జువైనల్ జస్టిస్ యాక్ట్- 2015 తో పాటు 2016లో నోటిఫై చేయబడిన నిబంధనలు పాటించనందుకు బాధ్యులైన అధికారులపై చర్య తీసుకున్న నివేదికను కూడా కమిషన్ కోరింది.
గత ఆరు నెలల్లో ఢిల్లీలో రక్షించిన వీధి బాలలు, సంరక్షణ గృహాలలో ఉంచిన పిల్లల సంఖ్య, ఆయా గృహాల నుంచి పారిపోయిన పిల్లల వివరాలు కూడా ఇవ్వాలని ఆదేశించింది. ఆ పిల్లలు, బాలల సంరక్షణ గృహాలు, పిల్లలు పారిపోయిన తేదీలు, పారిపోయిన ఘటనలకు సంబంధించిన కేసుల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల కాపీలు, ఢిల్లీలో నమోదైన పిల్లల సంరక్షణ సంస్థల సంఖ్య, వాటి వివరాలను అందించాలని NCPCR ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. JJ చట్టం- 2015 ప్రకారం ఏర్పాటు చేసిన తనిఖీ కమిటీ, CWC గత ఆరు నెలల్లో నిర్వహించిన తనిఖీల నివేదికలను కూడా కమిషన్ అడిగింది. ఈ వివరాలన్నీ 15 రోజుల్లోగా అందజేయాలని ఆదేశించింది.
