NCP chief Sharad Pawar: 6 నెలల్లో షిండే ప్రభుత్వం పడిపోవచ్చు, మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండంలంటూ ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ పేర్కొన్నారని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప్ర‌స్తుత ప్ర‌భుత్వ ప్రయోగం విఫలమైతే చాలా మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ అసలు పార్టీలోకి తిరిగి వస్తారని అన్నారు.  

Maharashtra Politics: మ‌హారాష్ట్ర రాజ‌కీయాల కాక‌రేపుతూనే ఉన్నాయి. రెబ‌ల్ ఎమ్మెల్యేల తిరుగుబాటు కార‌ణంగా శివ‌సేన‌, కాంగ్రెస్‌, ఎన్సీపీల సంకీర్ణ ప్ర‌భుత్వం కుప్ప‌కూలింది. ఈ క్ర‌మంలోనే బీజేపీ-శివ‌సేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు క‌లిసి మ‌హారాష్ట్రలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనూహ్యంగా శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యేల నాయ‌కుడు ఏక్‌నాథ్ షిండే ముఖ్య‌మంత్రిగా బాధ్య‌తలు చేప‌ట్టారు. సోమ‌వారం జ‌రిగిన ప్లోర్ టెస్ట్ లో కూడా విజ‌యం సాధించారు. రాష్ట్రంలో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు త‌ర్వాత కూడా రాష్ట్ర రాజ‌కీయాలు వేడెక్కుతూనే ఉన్నాయి. బీజేపీ-శివ‌సేన రెబ‌ల్ స‌ర్కారుపై ఇత‌ర పార్టీల నాయ‌కులు తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. బీజేపీ ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంద‌ని మండిప‌డుతున్నారు. 

ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం మ‌హారాష్ట్రలో ఏర్పాటైన బీజేపీ-శివ‌సేన రెబ‌ల్ ప్ర‌భుత్వంపై ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వచ్చే ఆరు నెలల్లో శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉన్నందున మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అసెంబ్లీలో బ‌ల ప‌రీక్షలకు ముందు ఎన్సీపీ శాసనసభ్యులు, పార్టీ ఇతర నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. "మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వచ్చే ఆరు నెలల్లో పడిపోవచ్చు, కాబట్టి మధ్యంతర ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి" అని సమావేశానికి హాజరైన ఎన్సీపీ నాయ‌కుడు శ‌ర‌ద్‌ప‌వార్ చెప్పిన‌ట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. "షిండేకు మద్దతు ఇస్తున్న చాలా మంది తిరుగుబాటు శాసనసభ్యులు ప్రస్తుత ఏర్పాటుతో సంతోషంగా లేరని పవార్ అన్నారు. మంత్రిత్వ శాఖలు పంపిణీ చేయబడిన తర్వాత, వారి అశాంతి బయటపడుతుందని, ఇది చివరికి ప్రభుత్వ పతనానికి దారి తీస్తుంది" అని శ‌ర‌ద్ ప‌వార్ పేర్కొన్నారు. 

ప్ర‌స్తుత శివ‌సేన రెబ‌ల్‌-బీజేపీ స‌ర్కారు ప్రయోగం విఫలమైతే చాలా మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ అసలు పార్టీలోకి తిరిగి వస్తారని కూడా శ‌ర‌ద్ ప‌వార్ అన్నారు. మన చేతిలో కేవలం ఆరు నెలల సమయం ఉండే అవ‌కాశ‌ముంద‌నీ, శాసనసభ్యులు వారి వారి అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎక్కువ సమయం గడపాలని ఆయన అన్నారు. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ల సంకీర్ణ‌ ప్రభుత్వం కూలిపోవడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్‌నాథ్‌ షిండే గురువారం ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీగా సీఎంగా బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణం చేశారు. షిండే నేతృత్వంలోని దాదాపు 40 మంది సేన ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, చివరికి ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వం బుధవారం కూలిపోయింది.

ఇదిలావుండగా, 288 మంది సభ్యుల సభలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం 164 ఓట్లతో ఫ్లోర్ టెస్ట్‌ను సులువుగా గెలుపొందడంతో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం తన ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. శివసేన రెబల్ నేతల చప్పట్ల మధ్య, కొత్త ప్రభుత్వం నిజంగానే "ED ప్రభుత్వం" అని అన్నారు. "అవును, ఇది ED ప్రభుత్వం - ఏకనాథ్-దేవేంద్ర ప్రభుత్వం" అంటూ పేర్కొన్నారు.