రాజ్యసభ ఫలితాలు ఊహించినవేనని, తనను ఏమీ ఆశ్చర్యపరచలేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వివరించారు. అంతేకాదు, తమకే ప్రతిపక్షాల నుంచి ఓ ఓటు ఎక్కువగా పడిందని వెల్లడించారు. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీకి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు.
ముంబయి: మహారాష్ట్రలో మొత్తం ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో మూడు సీట్లు బీజేపీ గెలిచి అధికార మహావికాలస్ అఘాడీ ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది. ఈ ఫలితాలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. అయితే.. తనను ఈ ఫలితాలు ఆశ్చర్యపరచలేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. రాజ్య సభ ఫలితాలు తననేమీ ఖంగుతినిపించలేదని వివరించారు. అంతేకాదు, తమ పార్టీ ఒక ఓటును ఎక్కువగా రాబట్టిందని తెలిపారు. ప్రతిపక్షాలవైపు మొగ్గిన ఓ స్వతంత్ర ఎమ్మెల్యే తమ పార్టీకే ఓటు వేశాడని పేర్కొన్నారు.
మహారాష్ట్రలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో శివసేన నుంచి సంజయ్ రౌత్, ఎన్సీపీ నుంచి ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ నుంచి ఇమ్రాన్ ప్రతాప్‌గడి గెలుపొందారు. కాగా, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి పియూశ్ గోయల్, రాష్ట్ర మాజీ మంత్రి అనిల్ బోండే, ధనంజయ్ మహదిక్‌లు విజయం సాధించారు.
ఈ ఫలితాలపై మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో పడిన ఓట్లను పరిశీలిస్తే.. మహావికాస్ అఘాడీకి చెందిన ప్రతి చట్టసభ్యులు లేదా ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లు తమ అభ్యర్థులు పొందారని అర్థం అవుతుందని వివరించారు. అయితే, ఎన్సీపీకి చెందిన అభ్యర్థి ప్రఫుల్ పటేల్ మాత్రం ఒక ఓటు ఇంకా అదనంగానే పొందారని పేర్కొన్నారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో తనకు తెలుసు అని తెలిపారు. ఆ ఓటు మహావికాస్ అఘాడీ ఓటు కాదని చెప్పారు. అది ప్రతిపక్షాల నుంచి పడిన ఓటు అని పేర్కొన్నారు.
కాగా, శివసేన పోటీ చేసిన ఆరో సీటు తమ అభ్యర్థికి పడిన ఓట్లలో చాలా తేడా ఉన్నదని శరద్ పవార్ అన్నారు. అక్కడ పోటీ చేయడమే సాహసం అని, ఆ సాహసాన్ని శివసేన చేసిందని వివరించారు. బీజేపీకి ఎక్కువ స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారని పేర్కొన్నారు. కానీ, రెండు పక్షాలకు అంటే బీజేపీకి, ప్రభుత్వ కూటమికి సరిపడా బలం లేదని అన్నారు. కేవలం స్వతంత్ర ఎమ్మెల్యేలతోనే ఆ సీటు గెలిచిందని చెప్పారు.
అయితే, బీజేపీ కూడా స్వతంత్రులను వారి వైపు తిప్పుకోవడంలో చాలా శ్రమించిందని, వారి కృషిని అభినందించాల్సిందేనని అన్నారు. అదే విధంగా మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీకి ఉన్న ముప్పేమీ లేదని చెప్పారు.
