బిహార్‌ గయాలోని (Bihar Gaya) డుమారియాలో నక్సలైట్స్(Naxals)  దారుణానికి ఒడిగట్టారు. డుమారియాలోని మనువార్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని నక్సల్స్ ఉరితీసినట్టుగా సమాచారం. 

బిహార్‌ గయాలోని (Bihar Gaya) డుమారియాలో నక్సలైట్స్(Naxals) దారుణానికి ఒడిగట్టారు. డుమారియాలోని మనువార్ గ్రామంలో (Manuwar village) ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరికి వేలాడుతూ కనిపించారు. అయితే వీరి నలుగురిని నక్సల్స్ ఉరి తీసినట్టుగా తెలుస్తోంది. శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. డుమారియా జిల్లాలో నక్సల్స్ కార్యాకలాపాలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి మనువార్‌ గ్రామంలోని నలుగురిని హత్య చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా నక్సల్స్‌ రెండు ఇళ్లను డైనమైట్‌తో పేల్చి వేశారు. 

ఈ ఘటనకు సంబంధించి ఓ గ్రామస్తుడు మాట్లాడుతూ.. ‘దాదాపు 20 నుంచి 25 మంది నక్సల్స్‌.. నలుగురు గ్రామస్తులను ఉరి తీశారు. వారి ఇళ్లపై బాంబులు వేశారు. గట్టిగా నినాదాలు చేశారు. గతంలో వారు మార్చి నెలలో వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారు’ అని తెలిపాడు. నక్సల్స్ గురించి పోలీసులకు సమాచారం ఇస్తున్నారనే నెపంతోనే వారు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తోంది.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.