Asianet News TeluguAsianet News Telugu

రాజీనామా వెనక్కి తీసుకున్న సిద్దూ.. కాంగ్రెస్‌కు మరో అల్టిమేటం.. ‘అప్పుడే ఆఫీసులో అడుగుపెడతా’

పంజాబ్‌ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఇంకా సమసిపోలేదు. సీఎంగా కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేసి పార్టీ నుంచి వీడినా సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నవ్‌జోత్ సింగ్ సిద్దూ తాజాగా పీపీసీసీ పదవికి తాను చేసిన రాజీనామాను వెనక్కి తీసుకుని పార్టీకి కొత్త అల్టీమేటం పెట్టారు. అడ్వకేట్ జనరల్‌‌ను తొలగించినప్పుడే తాను పార్టీ కార్యాలయంలో అడుగుపెడతారని స్పష్టం చేశారు. అడ్వకేట్ జనరల్ రాజీనామాను సీఎం చన్నీ ఇటీవలే తిరస్కరించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
 

navjot singh sidhu withdraw resignation sent new ultimatum to congress
Author
Chandigarh, First Published Nov 5, 2021, 6:00 PM IST

చండీగడ్: Punjabలో అధికార పార్టీ ఇంకా విభేదాలతో ఉక్కిరిబిక్కిరవుతూనే ఉన్నది. ఈ విభేదాలతోనే సీఎంగా కెప్టెన్ అమరీందర్ సింగ్ Resignation చేసి Congress వీడారు. ఇటీవలే కొత్త పార్టీని ప్రకటించారు. Navjot Singh Sidhuతో రాజుకున్న వివాదాలతోనే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. కొత్త సీఎంగా చన్నీని నియమించినా నవ్‌జోత్ సింగ్ ఫిర్యాదులు ఆగిపోలేవు. తన పీపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

చన్నీ క్యాబినెట్‌లో మంత్రుల చేర్పుపై అసంతృప్తి, అడ్వకేట్ జనరల్, డీజీపీలను తొలగించాలన్న డిమాండ్లతోనే ఆయన రాజీనామా చేసినట్టు కొన్నివర్గాలు తెలిపాయి. ఇటీవలే ఆయన ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. తాజాగా, పంజాబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి చేసిన తన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించారు. కానీ, వెంటనే పార్టీకి ఓ అల్టిమేటం పెట్టారు. ఏజీ, డీజీపీలను తొలగించాలని స్పష్టం చేశారు. తన రాజీనామాను వెనక్కి తీసుకున్నప్పటికీ అడ్వకేట్ జనరల్‌ను తొలగించిన రోజే పార్టీ కార్యాలయంలో అడుగుపెడుతానని అన్నారు.

Also Read: ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’.. కెప్టెన్ అమరీంద్ సింగ్ కొత్త పార్టీ పేరు.. కాంగ్రెస్‌కు రిజైన్

ఈ అల్టిమేటం రాష్ట్ర ప్రభుత్వంలో కొత్త సమస్యను తెచ్చిపెట్టేలా ఉన్నది. నవ్‌జోత్ సింగ్ సిద్ధూ నుంచి తరుచూ విమర్శలు రావడంతో ప్రస్తుత అడ్వకేట్ జనరల్ ఏపీఎస్ డియోల్ తన రాజీనామాను ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి సోమవారం అందజేశారు. కానీ, ఆయన అడ్వకేట్ జనరల్ రాజీనామాను తిరస్కరించినట్టు వార్తలు వచ్చాయి.

ప్రస్తుత అడ్వకేట్ జనరల్ డియోల్ రాష్ట్రంలో అకాలీల ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ పోలీసు చీఫ్ సుమేద్ సైనీకి కౌన్సెల్‌గా ఉన్నారు. సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్‌ని అవమానపరిచిన ఘటన, ఆందోళనకారులపై పోలీసుల ఫైరింగ్ కేసులో ప్రభుత్వం తరఫున ఆయన వాదించారు. పోలీసు అధికారికి బెయిల్ కోసం వాదించారు. 

Also Read: నన్ను సీఎం చేసి ఉంటే సక్సెస్ ఏంటో చూపెట్టేవాడ్ని.. ఈ సీఎం కాంగ్రెస్‌ను ముంచుతాడు.. వీడియోకు చిక్కిన సిద్దూ

ఈ కేసులో న్యాయం జరుపుతామని, డ్రగ్స్‌పై యుద్ధం చేస్తామన్న కీలక హామీపై కాంగ్రెస్ ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించిందని సిద్దూ అన్నారు. ఇప్పుడు ఆ కేసులో కాంగ్రెస్ వైఖరికి భిన్నంగా వాదించిన అడ్వకేట్ జనరల్‌నే కొనసాగించడం తగదని ఆయన వాదిస్తున్నారు. అంతేకాదు, ఐపీఎస్ అధికారి సహోతా కూడా రాష్ట్ర డీజీపీగా ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. వీరిద్దరిని వారి పొజిషన్‌ల నుంచి మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కొత్త అల్టీమేటంతో కాంగ్రెస్‌లో విభేదాలు మరింత పెరిగేలా ఉన్నాయని తెలుస్తున్నది.

ఏజీ, డీజీపీలను మార్చాలన్న డిమాండ్లను తాను సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ దృష్టికీ తీసుకెళ్లానని చెప్పారు. వాటిని అమలు చేస్తామని హామీనిచ్చారని, కానీ, తన డిమాండ్లు కార్యరూపం దాల్చలేదని అన్నారు.

భవిష్యత్‌లో కాంగ్రెస్‌కు రెండే మార్గాలున్నాయని తెలిపారు. ఒకటి పెద్ద పెద్ద హామీలను ఇవ్వడం.. రెండోది.. ఇది వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చి మళ్లీ ప్రజల ముందుకు వెళ్లడమేనని వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ పాలనపై పలువిధాల ప్రశ్నలు ఉదయిస్తున్నాయని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios