తీరక లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ అస్వస్థతకు గురయ్యారు. దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ తరపున ఆయన ప్రచారంలో పాల్గొన్నారు.

దీంతో పూర్తిగా అలసిపోయిన సిద్ధూకు వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారని, ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారని ఓ ప్రకటన విడుదల చేసింది. వరుసగా 17 రోజుల పాటు విమానాలు, హెలికాఫ్టర్లలో వెళ్లిన ఆయన 70 ప్రచార ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించడంతో సిద్ధూ గొంతు దెబ్బతిందని తెలిపారు.

దాని వల్ల ఆయన ప్రస్తుతం స్పష్టంగా మాట్టాడలేకపోతున్నారని... 3 నుంచి 5 రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్‌కు వెళ్లి రావడంతో పాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘రాహుల్ మాత్రమే నా కెప్టెన్’ అంటూ ఆయన వ్యాఖ్యానించడంతో పెను దుమారం రేగింది.