ఆప్ నేత రాఘవ్ చాద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ పాలిటిక్స్‌కు నవ్‌జోత్ సింగ్ సిద్దూ రాఖీ సావంత్ వంటివారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు మహిళల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ట్విట్టర్‌లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్‌ను విమర్శిస్తూ సిద్దూ వీడియో చేయగా, ఆ ట్వీట్‌కు సమాధానమిస్తూ రాఘవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చాద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవ్‌జోత్ సింగ్ సిద్దూపై విమర్శ చేస్తూ రాఘవ్ చాద వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. పంజాబ్ రాజకీయాలకు నవ్‌జోత్ సింగ్ సిద్దూ రాఖీ సావంత్ వంటివాడని ఘాటు విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలు అభ్యంతరకంగా ఉన్నాయని, మహిళ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ట్విట్టర్‌లో విమర్శలు వచ్చాయి.

ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై సిద్దూ చేసిన విమర్శలను తిప్పికొడుతూ రాఘవ్ చాద ఈ వ్యాఖ్యలు చేశారు. నవ్‌జోత్ సింగ్ సిద్దూ పంజాబ్ రాజకీయాలకు రాఖీ సావంత్ అని, ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై నాన్‌స్టాప్‌గా చేసిన విమర్శలతో కాంగ్రెస్ హైకమాండ్ నుంచి అక్షింతలు అందుకున్నారని పేర్కొన్నారు. నేడు కొంత మార్పుగా కెప్టెన్‌ను వదిలి అరవింద్ కేజ్రీవాల్ వెంటపడ్డారని ఆరోపించారు. ‘రేపటి వరకు ఆగండి.. కెప్టెన్‌పై మళ్లీ ఆయన దుర్భాషను పునరుద్ధరిస్తారు’ అని చురకలంటించారు.

ఆప్‌పై, ఢిల్లీ ప్రభుత్వంపై నవ్‌జోత్ సింగ్ సిద్దూ విమర్శలు చేస్తున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆప్ ప్రాథమిక, పంజాబ్ ఆప్ విభాగపు ట్విట్టర్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేస్తూ ఆ వీడియోను ట్వీట్ చేశారు. ఇందులో సిద్దూ మాట్లాడుతూ, గతేడాది కేంద్ర ప్రభుత్వం మూడు వివాదాస్పద సాగు చట్టాలు తెచ్చిందని, అందులో ఒకటి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నోటిఫై చేసిందని పేర్కొన్నారు. దాన్ని మళ్లీ డీనోటిఫై చేశారా? లేక అదే రెండు నాల్కల ధోరణి పాటిస్తూ రైతుల మద్దతుదారుగా నటిస్తున్నారా? అని ప్రశ్నించారు.