న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం తనకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును ప్రముఖ రచయిత్రి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోదరి గీతా మెహతా తిరస్కరించారు. అవార్డు ఇచ్చిన సమయం సరైంది కాదని ఆమె తాను తీసుకున్న నిర్ణయంపై వ్యాఖ్యానించారు 

ఆ మేరకు గీతా మెహతా న్యూయార్క్ నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. పద్మశ్రీ అవార్డుకు తాను అర్హురాలినని భావించి తనకు ఆ అవార్డును ఇవ్వడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తానని, కానీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆ అవార్డు తీసుకోవడం వల్ల అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఆమె అన్నారు. 

అవార్డు తీసుకోవడం తనకే కాకుండా ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరమైన విషయమని, అందుకు తాను చాలా విచారించాల్సి వస్తుందని ఆమె అన్నారు. సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్, మే నెలల్లో జరిగే అవకాశం ఉంది. 

ఒడిశాలో నవీన్ పట్నాయక్ బిజెడీ, బిజెపి పోటీ పడుతున్న నేపథ్యంలో అవార్డు తీసుకోవడం సరైంది కాదని గీతా మెహతా భావిస్తున్నారు. దానివల్ల తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని ఆమె అనుకుని ఉంటారు.