న్యూఢిల్లీ: ఐఎన్ఎస్ విక్రమాదిత్య నౌకలో శుక్రవారం నాడు చోటు చేసుకొన్న అగ్ని ప్రమాదంలో ఓ నౌకాదళ అధికారి మృతి చెందాడు.

విమానాలను తరలించే ఇండియాకు చెందిన ఏకైక  ఐఎన్ఎస్ విక్రమాదిత్య నౌక కర్ణాటకలోని కార్వార్  హర్బర్ ప్రాంతంలోకి ప్రవేశించే సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

నౌకలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొన్న సమయంలో  లెఫ్టినెంట్  కమాండర్  డీఎస్ చౌహాన్  ధైర్యంగా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడని నావికాదళం ప్రకటించింది. అయితే మంటలను ఆర్పే క్రమంలో  చౌహాన్ మృత్యువాత పడినట్టుగా  నావిక దళం ప్రకటించింది.

నౌకలో మంటలు ప్రస్తుతం అదుపులోకి వచ్చినట్టుగా నేవీ ప్రకటించింది. మంటలను ఆర్పే క్రమంలో తీవ్రంగా అస్వస్థతకు గురైన చౌహాన్ ను ఆసుపత్రికి తరలించే లోపుగానే ఆయన మృత్యువాత పడినట్టుగా నేవీ తెలిపింది.

నౌకలో మంటలు వ్యాపించడానికి  కారణాలను తెలుసుకొనేందుకు గాను విచారణకు ఆదేశించింది నేవీ.  ఐఎన్ఎస్ విక్రమాదిత్య 2013 నవంబర్ మాసంలో భారత్‌ నేవీ రంగంలో చేరింది.

284 మీటర్ల పొడవు, 60 మీటర్ల ఎత్తు ఈ నౌక ఉంటుంది. ఈ నౌక ఎత్తు 20 భవనాల ఎత్తుగా ఉంటుందని  చెబుతారు. ఈ నౌక సుమారు 40 వేల టన్నుల బరువు ఉంటుంది.