Nationwide Protest: పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రజలను పేదరికంలోకి నెట్టివేస్తోందని పేర్కొంటూ వామపక్షాలు దేశ‌వ్యాప్త ఆందోళ‌న‌కు పిలుపునిచ్చాయి. వారం రోజుల పాటు  జరిగే ప్ర‌భుత్వ వ్య‌తిరేక నిరసనలు నేడు షురు అయ్యాయి.  

Rising Inflation, Unemployment: పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగానికి వ్యతిరేకంగా మే 25 నుంచి మే 31 వరకు వారం రోజుల పాటు దేశవ్యాప్త ఆందోళనలకు వామపక్షాలు పిలుపునిచ్చాయి. అలాగే, ఏడు పాయింట్ల డిమాండ్ల చార్టర్‌ను కూడా ప్రతిపాదించారు. గత ఏడాది పెట్రోలియం ఉత్పత్తుల ధరలు 70 శాతం, కూరగాయల ధరలు 20 శాతం, వంటనూనెలు 23 శాతం, చిరుధాన్యాల ధరలు 8 శాతం పెరిగాయని వామపక్షాలు పేర్కొన్నాయి. విపరీతమైన ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు ఎన్నడూలేని భారాన్ని ఎదుర్కొంటున్నారని పార్టీలు చెబుతున్నాయి. పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్ ధావలే మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలు భరించలేని ధరల పెరుగుదలకు, నిరుద్యోగానికి దారితీస్తున్నాయని అన్నారు. అయితే, ఈ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ, సంఘ్‌ పరివార్‌లు మత సంబంధిత అంశాల‌ను తెర‌మీద‌కు తీసుకువ‌స్తున్నాయ‌ని ఆరోపించారు. 

దేశంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగంతో లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వామపక్షాలు తమ నిరసనలు తెలియజేస్తున్నాయి. అన్ని పెట్రోలియం ఉత్పత్తులపై సుంకం మరియు సర్‌ఛార్జ్‌లను మరింత సడలించాలని మరియు వంట గ్యాస్ ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. “మే 23న, మహారాష్ట్రలోని వామపక్ష పార్టీల నాయకుల ఆన్‌లైన్ సమావేశం జరిగింది. ఈ సమస్యలపై జిల్లా, తహసీల్ స్థాయిల్లో పెద్దఎత్తున ఐక్య నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నామమాత్రంగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది' అని అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ ధావలే తెలిపారు. ధావలే మాట్లాడుతూ, ముంబయిలో మే 18న జరిగిన సంయుక్త షెత్కారీ కమ్‌గర్ మోర్చా (SSKM), అనేక ప్రజా సంఘాలతో కూడిన జన్ ఆందోళన్ సంఘర్ష్ సమితి (JASS) కూడా మే 25-31 దేశవ్యాప్తంగా నిరసనలో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించినట్లు చెప్పారు. 

ఇదిలావుండ‌గా, ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సైతం భారత్ బంద్ (Bharat Bandh)కు పిలుపునివ్వ‌డంతో నేడు ప‌లు ప్రాంతాల్లో బంద్ కొన‌సాగుతోంది. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని సమాఖ్య నేతలు డిమాండ్‌ చేశారు. పలు డిమాండ్లతో ఈ బంద్‌ కు ఫెడరేషన్ పిలుపునిచ్చినట్టు బహుజన్ ముక్తి పార్టీ షహరాన్‌పూర్ జిల్లా అధ్యక్షుడు నీరజ్ ధిమాన్ తెలిపారు. రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) హామీ కోసం చట్టం రూపకల్పన, పాత పెన్షన్‌ పథకాన్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే.. ఎన్నికల్లో ఈవీఎంల వినియోగం వంటి అంశాలను కూడా ఆయన లేవనెత్తారు. భారత్‌ బంద్‌ను అన్నివర్గాల ప్రజలు విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

కాగా, భారత ఆర్థిక వ్యవస్థ మూలాధారాలు పటిష్టంగా ఉన్నప్పటికీ, పెరుగుతున్న విభజన, వ‌ర్గీక‌ర‌ణ‌, దేశ ఉనికికే ప్ర‌మాదమ‌ని ప్రపంచ బ్యాంకు మాజీ ఆర్థికవేత్త కౌశిక్ బసు అన్నారు. సమాజంలో విభజన తీసుకొచ్చేలా రాజకీయాలు చేయటం, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవటం వంటి చర్యలు భారత ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారుతున్నాయని అన్నారు. భారతదేశానికి అతిపెద్ద సవాలు నిరుద్యోగమని కౌశిక్ బసు అన్నారు.