త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేపట్టిన ‘‘యునైటెడ్ ఇండియా బ్రిగేడ్’’ ర్యాలీకి జాతీయ పార్టీల నేతలు, ప్రాంతీయ పార్టీల నేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నేతలు ప్రధాని మోడీపై ఫైరయ్యారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రధాని ఓట్లు దండుకుంటున్నారని కాంగ్రెస్ నేత సింఘ్వీ వ్యాఖ్యానించారు. మోడీ సర్కార్ దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలను విడిచిపెట్టడం లేదని శరద్ యాదవ్ ఫైరయ్యారు.

ఎంతోమంది త్యాగాలతో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని...ఇప్పుడు దేశానికి మళ్లీ ఆపద వచ్చిపడిందని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్ధుల్లా అన్నారు. దేశాన్ని రక్షించుకోవడానికి నేతలు బలిదానాలకు సిద్ధం కావాలని, మోడీ పాలనలో కశ్మీర్ తగలబడిపోతోందని ఫరూఖ్ ఆవేదన వ్యక్తం చేశారు.

మతం పేరుతో ప్రధాని దేశ ప్రజలను విభజిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని ఎవరన్నది తర్వాత చూద్దాం.. ముందు మోడీని గద్దె దించుదామని ఫరూఖ్ అబ్ధుల్లా నేతలకు సూచించారు. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. స్వతంత్రం కోసం ఇది మరో పోరాటమని, బీజేపీని గద్దెదింపాలని, మోడీని ఇంటికి సాగనంపాలన్నారు. బీజేపీయేతర నేతలంతా ఐక్యంగా ఉంటేనే అది సాధ్యమని ఆయన పిలుపునిచ్చారు.