National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని రెండో రోజు కూడా ఈడీ విచారించింది. దాదాపు 10 గంటల పాటు విచారించిన ఈడీ.. బుధవారం కూడా హాజరు కావాలని రాహుల్‌కు సమన్లు జారీ చేసింది.
National Herald Case: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ మంగళవారం వరుసగా రెండో రోజు కూడా ప్రశ్నించింది. రాహుల్ గాంధీని మంగళవారం దాదాపు 10 గంటల పాటు ఈడీ విచారించింది. అదే సమయంలో.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం కూడా హాజరు కావాలని రాహుల్‌కు సమన్లు జారీ చేసింది. పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 కింద విచారిస్తున్న ఈడీ.. రెండో రోజు కూడా ప్రశ్నల వర్షం కురిపించింది.
సోమవారం రాహుల్ గాంధీని దాదాపు 10 గంటల పాటు ఈడీ ప్రశ్నించింది. ఈ కేసులో రాహుల్ గాంధీని రెండు రోజుల్లో దాదాపు 21 గంటల పాటు ప్రశ్నించారు. ఇందులో బ్యాంకు ఖాతాలతోపాటు పలు అంశాలను ప్రశ్నించినట్లు సమాచారం.
రాహుల్ గాంధీ మంగళవారం ఉదయం 11.10 గంటలకు ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఈడీ విచారణ జరిగింది. అనంతరం గంట లంచ్ బ్రేక్ . విరామం తరువాత సాయంత్రం 4.45 గంటల సమయంలో తిరిగి విచారణ కోసం ED కార్యాలయానికి చేరుకున్నాడు. రెండోరోజు సుమారు 10 గంటలపాటు రాహుల్ గాంధీని ఈడీ విచారించింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు.
రాహుల్‌గాంధీపై ఈడీ విచారణకు నిరసనగా రెండో రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఢిల్లీలో నిరసన తెలిపారు. ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలను కూడా ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా, ఏఐసీసీ కార్యదర్శి ప్రణవ్ ఝా, ఎన్‌ఎస్‌యూఐ చీఫ్ నీరజ్ కుందన్, కేసీ వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్, దీపీందర్ సింగ్ హుడా తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే కాంగ్రెస్ కార్యాలయం చుట్టూ 144 సెక్షన్ విధించారు.
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతల విమర్శలు
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై నిర్దాక్షిణ్యంగా దాడులు చేస్తే ఢిల్లీ పోలీసులు, మోదీ ప్రభుత్వం సిగ్గులేకుండా పోయిందని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా అన్నారు. మహిళా ఎంపీ జేబీ మాథర్‌ను పురుష కానిస్టేబుళ్లు ఈడ్చుకెళ్లిన తీరు, కొట్టిన తీరు మోదీ ప్రభుత్వ మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూన్ 2న హాజరుకావాలని రాహుల్ గాంధీని దర్యాప్తు సంస్థ గతంలోనే కోరింది. కానీ రాహుల్ గాంధీ విదేశాల్లో ఉండటంతో.. తాను విచారణకు హాజరు కాలేనని వేరే తేదీని అభ్యర్థించాడు. ఇదే విషయమై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని జూన్ 8న హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. కానీ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆమెకు కరోనా సోకింది. ఇంకా కోలుకోనందున హాజరు కావడానికి మరింత సమయం కోరింది.
