Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ కు చుక్కలు చూపిన నేతలు: ఎన్టీఆర్ తో ములాయం అనుబంధం ఇదీ...

సమాజ్ వాదీ పార్టీ  వ్యవస్థాపకులు ములాయం సింగ్  యాదవ్ కు టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ కు మధ్య మంచి సంబంధాలుండేవి. నేషనల్ ఫ్రంట్  చైర్మెన్  గా ఎన్టీఆర్ కొనసాగిన సమయంలో  ములాయం తో మంచి అనుబంధం ఉందని టీడీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు.

National Front: Good relations Between Mulayam Singh Yadav And NTR
Author
First Published Oct 10, 2022, 12:39 PM IST

న్యూఢిల్లీ:  ఎస్పీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ కు టీడీపీ వ్యవస్థాపకులు  ఎన్టీఆర్ కు మంచి  అనుబంధం ఉంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో  ఎన్టీఆర్    నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు. ఈ ఫ్రంట్  లో పలు ప్రాంతీయ పార్టీలు భాగస్వామిగా ఉండేవి.

నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు కంటే  ముందే  జాతీయ పార్టీని ఏర్పాటు  చేయాలనే ఆలోచన కూడా ఎన్టీఆర్ చేశారు.భారతదేశం పేరుతో జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలని భావించారు. కానీ జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తే రాజకీయంగా నిలదొక్కుకునే పరిస్థితులపై పార్టీలో కొందరు నేతలు అపనమ్మకం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీ కంటే ఫ్రంట్  ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని మరికొందరు ఎన్టీఆర్ కు సూచించారు. దీంతో జాతీయ పార్టీ ఏర్పాటు కంటే ఫ్రంట్ ఏర్పాటు చేయడమే రాజకీయంగా ప్రయోజనమని ఎన్టీఆర్ భావించారు. టీడీపీ నిర్వహించే మహానాడులోనే  జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని ఎండగట్టేందుకు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని  భావించారు. మహానాడు వేదికగా ఈ విషయాన్ని ఎన్టీఆర్ ప్రకటించారు. 

కాంగ్రెస్ వ్యవహరించిన తీరే ఎన్టీఆర్ ను జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు పురికొల్పిందని అప్పట్లో ఎన్టీఆర్ కు సన్నిహితంగా ఉన్న నేతలు చెబుతుంటారు. 

1984 లో నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్  జరడగానికి కొన్నిరోజుల ముందే  న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ డెవలప్ మెంట్ సమావేశం నుండి ఎన్టీఆర్ వాకౌట్ చేశారు. కేంద్రంలోని కాంగ్రెస్ తీరును ఎండగట్టారు.ఈ సమావేశం జరిగిన కొన్ని నెలల తర్వాతే నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ తో  ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోయింది.  ఈ సమయంలో పలు రాష్ట్రాల సీఎంలు  ఎన్టీఆర్ కు అండగా నిలిచారు. లెఫ్ట్ పార్టీలు, డీఎంకె , బీజేపీ  లు ఎన్టీఆర్ కు అండగా నిలిచిన విషయం తెలిసిందే. 

1986లో  తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై మెరీనా బీచ్ లో  నేషనల్ ఫ్రంట్ ను  ప్రకటించారు. నేషనల్ ఫ్రంట్ చైర్మెన్ గా  ఎన్టీఆర్ వ్యవహరించారు. దేశంలోని కాంగ్రెసేతర   పార్టీలను ఈ ఫ్రంట్ కిందకు తీసుకు వచ్చారు ఎన్టీఆర్.  ఆయా రాష్ట్రాల్లో ఎన్టీఆర్   విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. హర్యానా, అసాం, యూపీ,కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోని ఆయా  ప్రాంతీయ పార్టీలు నేషనల్ ఫ్రంట్ లో కీలక భూమిక పోషించాయి.  

నేషనల్ ఫ్రంట్  ఏర్పాటు ఛైర్మెన్ హోదాలో ఎన్టీఆర్  విజయవాడ వేదికగా నిర్వహించిన సభలో పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. ములాయం సింగ్ యాదవ్  కు సోషలిస్ట్ భావాలున్నాయి. ఎన్టీఆర్ కు కూడా ఇవే భావాలున్నాయి.దీంతో ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. పాలనలో కూడా ఈ ఇద్దరి నేతలు తమ అభిప్రాయాలను పంచుకొనేవారు. 

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ములాయం సింగ్ యాదవ్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాటం  నడిపేవాడు. 1980లో  ములాయం సింగ్  లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు.ఆ తర్వాత ఈపార్టీని ములాయం సింగ్ జనతాదళ్ లో విలీనం చేశాడు. 1992 లో సమాజ్  వాదీ పార్టీని ఏర్పాటు చేశారు ములాయం సింగ్ యాదవ్. నేషనల్ ఫ్రంట్  లో జనతాదళ్ కీలక భాగస్వామిగా ఉండేది.   నేషనల్  ఫ్రంట్ కు చెందిన నేతలు విజయవాడకు వచ్చిన సమయంలో  ములాయం సింగ్ యాదవ్ కూడ ఉన్నారు.  

నేషనల్ ఫ్రంట్ చైర్మెన్ హోదాలో ఎన్టీఆర్ పలు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో  పాల్గొన్నారు. హర్యానాలో దేవీలాల్ కు మద్దతుగా ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించారు.యూపీలో కూడా ములాయం సింగ్ యాదవ్ కు మద్దతుగా ఎన్టీఆర్ ప్రచారం చేశారు. బీహర్ లో లాలూప్రసాద్  యాదవ్  రెండో దఫా సీఎంగా  బాధ్యతలు స్వీకరించే సమయంలో ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ ఛైర్మెన్ హోదాలో  లాలూను అభినందించారు.

1989 లో  కేంద్రంలో నేషనల్ ఫ్రంట్  కీలక  ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ఫ్రంట్ లో  ఉన్న పార్టీలు 146 ఎంపీ సీట్లు దక్కించుకున్నాయి. బీజేపీ, లెఫ్ట్ పార్టీ లు  ఈప్రభుత్వానికి బయట నుండి మద్దతును ప్రకటించాయి.  ఈ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఎన్టీఆర్, ములాయం సింగ్ లు కీలకంగా వ్యవహరించారు. 1989 డిసెంబర్ 2న వీపీ సింగ్ ప్రధానిగా ప్రమాణం చేశారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో కూడా జనతాదళ్ నేతలు ప్రచారం నిర్వహించేవారు. అప్పట్లో జనతాదళ్ లో కీలకంగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ లు టీడీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ కు చుక్కలు చూపించారు. కాంగ్రెస్ వ్యతిరేక పోరాటంలో కీలకంగా వ్యవహరించారు. 

ఎన్టీఆర్, ములాయం సింగ్ మధ్య పోలికలు

టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, సమాజ్ వాదీ పార్టీ  మధ్య కొన్ని పోలికలున్నాయి.  ప్రధాని పదవిని చేపట్టాలని ములాయం సింగ్ యాదవ్ కు కోరిక ఉండేదని చెబుతుంటారు.  ఎన్టీఆర్ కు కూడ ఈపదవిపై మక్కువ ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు. కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ములాయం సింగ్ యాదవ్ పనిచేశారు. కానీ ప్రధాని పదవిని దక్కించుకోలేదు. 1989లో నేషనల్  ఫ్రంట్ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటైంది.అయితే  ఆ సమయంలో టీడీపీకి 2 ఎంపీ  స్థానాలు మాత్రమే దక్కాయి. ఎన్టీఆర్  చనిపోయిన తర్వాత యూపీఏ, యూఎన్‌పీఏ ప్రభుత్వాలు కేంద్రంలో ఏర్పాటయ్యాయి.ఈ ప్రభుత్వాల ఏర్పాటులో చంద్రబాబు కీలకంగా వ్యవహరించారు.ఈ ప్రభుత్వాల ఏర్పాటులో ములాయం కీలకంగా వ్యవహరించారు.
ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన టీడీపీని 1995 లో చంద్రబాబు  దక్కించుకున్నారు.  సమాజ్ వాదీ పార్టీలో గతంలో ఇదే తరహ ఘటనలు చోటు చేసుకున్నాయి. అఖిలేష్ యాదవ్  ఎస్పీని తన హస్తగతం చేసుకున్నాడు. సమాజ్ వాదీ పార్టీ, టీడీపీ ఎన్నికల గుర్తులు సైకిలే.

Follow Us:
Download App:
  • android
  • ios